అజిత్ తర్వాతి చిత్రానికి దర్శక ద్వయం?
దర్శక ద్వయం గాయత్రి –పుష్కర్,
నటుడు అజిత్
తమిళసినిమా: అజిత్ చిత్రం వస్తుందంటే ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కాగా ఆయన ఇటీవల నటించిన విడాముయర్చి చిత్రం కాస్త నిరాశ పరిచినా, వెంటనే గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంతో అభిమానులను ఉత్సాహపరచడానికి అజిత్ సిద్ధమయ్యారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న తెరపైకి రానుంది. దీంతో అజిత్ తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. కాగా అజిత్ హీరోగా నటుడు ధనుష్ దర్శకత్వంలో చిత్రం తెరకెక్కనున్నట్లు ప్రచారం జరిగింది. త్వరలో ధనుష్ ఆయనకు కథ చెప్పడానికి సిద్దం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శక ద్వయం పుష్కర్–గాయత్రి ఇటీవల ఒక చిత్రోత్సవాల వేడుకలో నటుడు అజిత్‌కు కథ చెప్పినట్లు, ఆయనకు ఆ కథ నచ్చినట్లు తాజాగా ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకు ముందు మాదవన్, విజయ్‌సేతుపతి హీరోలుగా ఈ దర్శక ద్వయం తెరకెక్కించిన విక్రమ్ వేదా చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇటీవల వీరు వెబ్ సిరీస్‌పై దృష్టి సారిస్తున్నారు. అలా వీరు రూపొందించిన సుళల్, వదంతి, సుళల్– 2 వంచి వెబ్ సిరీస్ మంచి ప్రేక్షకాదరణను పొందాయి. కాగా ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం గురించి దర్శక ద్వయంలో ఒకరైన గాయత్రి స్పందిస్తూ ఎవరైనా నటుడు అజిత్‌తో చిత్రాన్ని చేయాలని కోరుకుంటారన్నారు. అజిత్ హీరోగా చిత్రం చేసే అవకాశం వస్తే అందరి కన్నా సంతోష పడేది తానేనన్నారు. కాబట్టి తాము కూడా అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా నటుడు అజిత్ నటించే తదుపరి చిత్రం అప్‌డేట్ కోసం ఆయన అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్రస్తుతం కార్ రేస్‌లపై దృష్టి సారిస్తున్న అజిత్ తన తదుపరి చిత్రాన్ని ఎవరి దర్శకత్వంలో నటించేది త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.


