మాపై నిందలు వేస్తున్నారు!
● ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి
తమిళసినిమా: తమిళ్ నిర్మాతల మండలికి దక్షిణ భాతర సినీ కార్మికుల సమాఖ్య ( ఫెప్సీ)కి మంధ్య అభిప్రాయ బేధాలు తలెత్తిన విషయం తెలిసిందే. వేతనాలు వంటి పలు అంశాల వ్యవహారంలో ఈ రెండు సంఘాల మధ్య చాలా కాలంగా ఆరోపణలు ప్రతి ఆరోపణలు జరుగుతున్నాయి. తాజాగా ఇవి పతాక స్థాయికి చేరుకున్నాయి. ఎంత వరకూ అంటే తమిళ్ నిర్మాతల సంఘం దక్షిణాది సినీ కార్మికల సమాఖ్యకు పోటీగా తమిళ్ సినీ కార్మికుల సమాఖ్యను ఎర్పాటు చేసేంతదాకా. తమిళ్ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో ఇటీవల ఒక దిన పత్రికలో ప్రకటన వెలువడింది. ఈ నేపధ్యంలో దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్‌కే. సెల్వమణి ఆదివారం చైన్నెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము నిర్మాతల మండలి కోసం ఎంతగానో దిగొచ్చామని చెప్పారు. కార్మికుల వేతనాల నుంచి చాలా విషయాల్లో నిర్మాతకు సహకరిస్తున్నామన్నారు. అయితే వారిలో ఐక్యత లేక సమస్యలను పరిష్కరించుకోలేక తమపై నిందలు వేస్తున్నారని అన్నారు. కొత్తగా తమిళ్ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో సంఘాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగా ఇటీవల ఓ దినపత్రికలో తమిళ్ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారని అన్నారు. దాన్ని దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి కార్యాలయం నుంచి విడుదల చేసినట్లు పేర్కొన్నారన్నారు. ఈ విషయమై తాము ఫిలింఛాంబర్ నిర్వాహకులను సంప్రదించగా తమ ఛాంబర్ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదని చెప్పారన్నారు. ప్రతిక నిర్వాహకులను అడగ్గా తమకు ఆ ప్రకటన తమిళ్ నిర్మాతల మండలి నుంచి వచ్చిందని చెప్పారన్నారు. వారిలో వారికి సఖ్యత లేక తమ సమాఖ్యను విడదీసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
కుట్రలు పాల్పడుతోంది వారే..
కొందరు నిర్మాతలే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని, వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం నుంచి ఒక్క కార్మికుడు కూడా బయటకు వెళ్లడని అన్నారు. కారణం తమ సమాఖ్య అంత కట్టుదిట్టంగా ఉందని , వారి శ్రేయస్సు కోసమే తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇకపోతే నిర్మాతలు తమ చిత్రాల షూటింగ్‌లను తమిళనాడులో కాకుండా ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాల్లో చేస్తున్నారని, అందువల్ల తమిళ సినీ కార్మికులకు పని లేకుండా పోతోందని అన్నారు. తప్పని సరి అయితేనే తమిళ చిత్రాల షూటింగ్‌లను ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తే బాగుంటుందని, తమిళ చిత్రాలను నమ్ముకుని 25 వేల మంది కార్మీకులు ఉన్నారని ఆర్‌కే.సెల్వమణి పేర్కొన్నారు. ఈ విషయంలో నటీనటులు కూడా ఆలోచించాలన్నారు.


