జాతీయ విద్యా విధానంపై ధ్వజం
● డీఎంకే ప్రచార విభాగ ఉప కార్యదర్శి విమర్శలు
తిరుత్తణి: కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న జాతీయ నూతన విద్యా విధానం అమలు తమిళనాడులో సాధ్యం కాదని డీఎంకే ప్రచార విభాగం ఉప కార్యదర్శి తమిళన్ ప్రసన్న పేర్కొన్నారు. తిరువళ్లూరు వెస్ట్ జిల్లా డీఎంకే యువజన విభాగం ఆధ్వర్యంలో కనకమ్మసత్రంలో ఆదివారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్రానికి నిధులు నిలుపుదల, లోక్‌సభ స్థానాలు తగ్గింపు, కొత్త విద్యా విధానంతో పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీరుకు నినరసగా నిర్వహించిన సభకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ అధ్యక్షత వహించారు. యువజన విభాగం జిల్లా కన్వీనర్ తిరుత్తణి కిరణ్ స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా డీఎంకే ప్రచార విభాగ ఉప కార్యదర్శి తమిళన్ ప్రసన్న పాల్గొని, ప్రసంగించారు. ఇతర భాషలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు వీలుగా హిందీ భాషను రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేంద్రం మరొక అడుగు ముందుకేసి జాతీయ నూతన విద్యా విధానం పేరిట గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు. కుల వృత్తులు చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయన్నారు. 3, 5, 8, 10వ తరగతులవారు పబ్లిక్ పరీక్షలు రాయాల్సి ఉంటుందని, టెన్త్, ప్లస్‌టూ పరీక్షలు కేంద్ర సిలబస్ ద్వారా ఉంటాయని, దీంతో రాష్ట్ర విద్యార్థుల జీవితాలు నాశనమవుతాయని ఆరోపించారు. అందుకే కేంద్ర నూతన విద్యా విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించదన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ లేకపోవడంతో ఎంపీ స్థానాలు తగ్గించే కుట్ర పన్నుతున్నట్లు ఆరోపించారు. తిరువళ్లూరు ఎమ్మెల్యే రాజేంద్రన్, తిరువలంగాడు యూనియన్ కార్యదర్శి గూలూరు రాజేంద్రన్, యువజన విభాగం ఉప కార్యదర్శి భువనేష్‌కుమార్ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాట్లు చేపట్టారు.


