నెహ్రూనగర్‌లో కలెక్టర్ తనిఖీలు
తిరుత్తణి: తిరుత్తణిలో పోరంబోకు స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న అర్హులకు ఉచిత ఇంటి పట్టాలు పంపిణీకి సంబంధించి జిల్లా కలెక్టర్ సోమవారం తనిఖీ చేశారు. రాష్ట్రంలో అభ్యంతరాలు లేని పోరంబోకు స్థలంలో నివాశముంటున్న వారికి ఉచిత ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. దీంతో తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా పోరంబోకు స్థలాల్లో చాలా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారి వివరాలను రెవెన్యూ సిబ్బంది సేకరించి, కలెక్టర్‌కు సమర్పించారు. ఇందులో భాగంగా తిరుత్తణిలోని ఇంద్రా నగర్, పెరియార్‌నగర్, నెహ్రూ నగర్, అక్కయ్యనాయుడు వీధి సహా వివిధ ప్రాంతాల్లో దాదాపు 1600 మంది పోరంబోకు స్థలంలో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతాప్ నెహ్రూ నగర్, పెరియార్ నగర్‌లో పోరంబోకు స్థలాల్లో ఉంటున్నవారి వివరాలు సేకరించి తనిఖీ చేశారు. త్వరలో అర్హులైన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉచిత ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్డీఓ దీప, తహశీల్దారు మలర్‌విళి, మున్సిపల్ కౌన్సిలర్ అశోక్‌కుమార్, ఆర్‌ఐ గణేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


