కొడైకెనాల్‌లో ఈ పాస్ విధానం
సేలం: కొడైకెనాల్‌లో వాహన రాకపోకలపై తీవ్ర కట్టుబాట్లు అమలు చేశారు. మంగళవారం నుంచి ఈ–పాస్ విధానం ప్రారంభమైనది. కోర్టు ఆదేశం ప్రకారం, మంగళవారం నుండి కొడైకెనాల్‌లో వారంలో ఐదు రోజులు రోజుకు 6,000 పర్యాటక వాహనాలను, వారాంతాలు, సెలవు రోజుల్లో 8,000 పర్యాటక వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. వారాంతపు వేడుకలను జరుపుకోవడానికి గత రెండు రోజులుగా దిండిగల్ జిల్లా కొడైకెనాల్‌కు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తమిళనాడులో ప్లస్ 2, ప్లస్ 1 పరీక్షలు పూర్తయినందున, పర్యాటకుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. తమిళనాడులోనే కాదు, వివిధ రాష్ట్రాల్లో కూడా వేడి 100 డిగ్రీలకు చేరుకుంటోంది. ఈ క్రమంలో కొడైకెనాల్‌లో ఇప్పుడు సీజన్ ప్రారంభం కావడంతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. పగటిపూట మితమైన వేడి రాత్రి చల్లని వాతావరణం ఉంటోంది. దీన్ని ఆస్వాదించడానికి తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు కొడైకెనాల్‌కు తరలివస్తున్నారు. ఇక్కడ పర్యాటకులు మోయిర్ పాయింట్, గుణ గుహ, పైన్ ఫారెస్ట్, పిల్లర్ రాక్, గ్రీన్ వ్యాలీ, కాకర్స్ వాక్ వంటి ప్రదేశాలకు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాధిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదేశం ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుండి కొడైకెనాల్‌లో వారం రోజులలో 6,000 పర్యాటక వాహనాలను, వారాంతాల్లో 8,000 పర్యాటక వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఇందుకు గాను ఈ–పాస్‌ను ఆన్‌లైన్ ద్వారా తీసుకోవాలి. ఇదిలా ఉండగా ఈ–పాస్ విధానాన్ని అమలు చేయడాన్ని ఖండిస్తూ కొడైకెనాల్‌లో వ్యాపారులు ఆందోళన చేపడుతున్నారు. ఏప్రిల్ 2వ తేదీ కొడైకెనాల్ నగర వ్యాప్తంగా దుకాణాలను మూసి ఆందోళన చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఇదే విధంగా కొడైకెనాల్ బస్టాండ్ వద్ద ఒక ఎకరా స్థలంలో 100 వాహనాలను నిలిపే విధంగా పార్కింగ్ సౌకర్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ పనులు వారం రోజుల్లో పూర్తి అవుతాయని నిర్వాహకులు వెల్లడించారు. ప్రస్తుతం రోడ్డు పక్కన వాహనాలు పార్కింగ్ చేసే విధంగా తాత్కాలిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
జోరుగా తాత్కాలిక పార్కింగ్ నిర్మాణ పనులు
2న వ్యాపారులు ఆందోళన
కొడైకెనాల్‌లో ఈ పాస్ విధానం


