ఐఐటీలో సైబర్ కమాండో శిక్షణ పూర్తి
సాక్షి, చైన్నె: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చొరవతో, ’సైబర్ కమాండోస్’ కార్యక్రమంతో ఒక ప్రత్యేక దళాన్ని సృష్టించే విధంగా ఐఐటీ మద్రాసు ప్రణాళికను సిద్ధం చేసింది. భారతదేశ సైబర్ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా శిక్షణను వేగవంతం చేశారు. ఇందులో తొలి బ్యాచ్ శిక్షణ ముగిసింది. ఐఐటీ మద్రాస్ ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ సైబర్ కమాండోల మొదటి బ్యాచ్‌కు శిక్షణను పూర్తి చేసింది, దీని ద్వారా భారతదేశం అంతటా చట్ట అమలు, అధికారులను అధునాతన సైబర్ భద్రతా పద్ధతులతో సన్నద్ధం చేశారు. శిక్షణ తో చట్ట అమలు అధికారులకు డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌లో ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వీలు కల్పించారు. ప్రవర్తక్ ద్వారా శిక్షణ పొందిన 37 మంది లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అధికారిక ముగింపు కార్యక్రమం మంగళవారం ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో జరిగింది. తమిళనాడు ఏడీజీపీ (సైబర్ క్రైమ్ వింగ్) డాక్టర్ సందీప్ మిట్టల్,ప్రవర్తక్ చీఫ్ నాలెడ్జ్, డిజిటల్ స్కిల్స్ అకాడమి ప్రతినిధులు డాక్టర్ శంకర్ రామ్, బాలమురళి శంకర్, మంగళ సుందర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సైబర్ దాడుల నుంచి దేశాన్ని రక్షించడంలో, సున్నితమైన డేటాను రక్షించడంలో, డిజిటల్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో ఈ ప్రత్యేక దళం ముందంజలో ఉంటుంది. సైబర్ కమాండోలు ఇప్పటికే ఉన్న సైబర్ క్రైమ్ సెల్స్ నుండి గణనీయమైన అప్‌గ్రేడ్‌ను సూచిస్తారు. ప్రధానంగా సైబర్ నేరాల దర్యాప్తు, విచారణ వంటి రియాక్టివ్ చర్యలపై దృష్టి సారిస్తుండగా, కమాండోలు చురుకై న శక్తిగా ఉంటారు. ముగింపు సభలో తమిళనాడుకు చెందిన సైబర్ క్రైమ్ వింగ్ ఏడీజీపీ (సైబర్ క్రైమ్ వింగ్) డాక్టర్ సందీప్ మిట్టల్ మాట్లాడుతూ ‘‘సైబర్ స్పేస్‌లో ఒక చిన్న చర్య భౌతిక ప్రపంచంలో అసమాన ప్రభావానికి దారితీస్తుందన్నారు. గత ఒక సంవత్సరం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ద్వారా భారతదేశం ఆదా చేసిన మొత్తాన్ని, గత నాలుగు సంవత్సరాలలో భారతదేశంలో జరిగిన సైబర్ నేరాల కారణంగా కోల్పోవాల్సివ చ్చిందన్నారు. సైబర్ స్పేస్ ఇప్పటికే భూమి, గాలి, నీరు, అంతరిక్షంతో పాటు యుద్ధ డొమైన్‌గా గుర్తించబడుతోందన్నారు. భారతదేశంలో విధాన రూపకర్తగా, దీనిని యుద్ధంగా గుర్తించి, దాని పౌరుల జాతీయ ఆర్థిక ప్రయోజనాలను కాపాడటానికి తగిన చర్య తీసుకోవడానికి ఇది సరైన సమయం వివరించారు. సైబర్ బెదిరింపులను పరిశోధించడంలో, దర్యాప్తులలో సహాయం చేయడంలో ఈదళం మెరుగైన నైపుణ్యం కలిగి ఉంటుందన్నారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసినందుకు అందరినీ అభినందించారు. ఈ సందర్భంగా ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి పంపిన సందేశంలో సైబర్ కమాండోలను అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా, తాము వారికి అవసరమైన సహాయం అందించామన్నారు. ఇది నిరంతర అభ్యాస వ్యాయామం అవుతుందన్నారు. తాము వేసిన పునాది ద్వారా కమాండోలు ఇప్పుడు ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికతపై పట్టు సాధిస్తారాన్నారు.
ఐఐటీలో సైబర్ కమాండో శిక్షణ పూర్తి


