అన్నామలైకు పదవీ గండం
సాక్షి, చైన్నె: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలైను అధిష్టానం తప్పించబోతున్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. ఆయన స్థానంలో దక్షిణాదికి చెందిన సీనియర్ నేత, పార్టీ శాసన సభా పక్ష నేత నైనార్ నాగేంద్రన్‌కు ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు చర్చ ఊందుకుంది. వివరాలు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై పగ్గాలు చేపట్టినానంతరం తమిళనాట ఆ పార్టీ బలం పెరిగింది. రాష్ట్రంలో ఆయన చేసిన పాదయాత్రతో పాటూ అధికార పక్షం, ప్రధాన ప్రతి పక్షం అన్నాడీఎంకేను ఢీకొట్టే విధంగా దూకుడు ప్రదర్శించడం కలిసి వచ్చింది. అధికార డీఎంకేను ఢీ కొట్టినా, ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేతో ఆయన వైర్యం పెంచుకోవడం బీజేపీలోని సీనియర్లకు ఇష్టం లేదని చెప్పవచ్చు. రాష్ట్రంలో రెండవ అతి పెద్ద పార్టీగా ఉన్న అన్నాడీఎంకేను తనవ్యాఖ్యలతో అన్నామలై దూరం చేసుకోవడాన్ని సీనియర్లు తీవ్రంగానే పరిగణించారు. గత లోక్ సభ ఎన్నికలలో కన్యాకుమారి, రామనాథపురం, కోయంబత్తూరుతోపాటూ కొన్ని చోట్ల గెలుపు అవకాశాలు ఉన్న నేతలు సరైన కూటమి మద్దతు అన్నది లేని కారణంగా ఓటమి పాలు కావాల్సి వచ్చిందంటూ అధిష్టానానికి సీనియర్లు గత కొంత కాలంగా ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. అన్నాడీఎంకే బలం కలిసి వచ్చి ఉంటే ఈ పాటికి కనీసి నాలుగురు పార్టీ ప్రతినిధులు పార్లమెంట్‌లో అడుగు పెట్టి ఉండే వారని పేర్కొంటూ వచ్చారు. ఈ పరిణామాలు ఓ వైపు ఉంటే, ప్రస్తుతం 2026 ఎన్నికలను కేంద్రంలోని బీజేపీ తీవ్రంగానే పరిగణించింది. తమను ఢీ కొట్టే విధంగా సీఎం స్టాలిన్ దూకుడు పెంచడాన్ని పరిగణించి డీఎంకే ఓటమి లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. ఇందు కోసం అన్నాడీఎంకేను మళ్లీ అక్కున చేర్చుకునే దిశగా కసరత్తులు, పొత్తుల చర్చలు జరుగుతున్నట్టు గత వారం రోజులుగా తమిళనాట మీడియా కోడైకూస్తూ వస్తున్నది.
అన్నామలైకు గండం..
2026 ఎ న్నికల నేపథ్యంలో డీఎంకేను ఓడించేందుకు తమిళనాట బలమైన కూటమి అవశ్యమని పరిగణించిన బీజేపీ పెద్దలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామిని ఢిల్లీకి పిలిపించి మరీ బుజ్జగించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో అన్నామలై రూపంలో తమకు ఎదురైన సమస్యలు, పార్టీలో ఉన్న అసంతృప్తిని బీజేపీ పెద్దల ముందు పళణి స్వామి ఉంచినట్టు సమాచారం. అదే సమయంలో కొంగు మండలంలో కీలక నేతగా పళణి స్వామి ఉన్నారు. కూటమి ఏర్పాటైన పక్షంలో అదే మండలంలో అన్నామలై సైతం మరో కీలక నేతగా మారడం ఖాయం అయితే, ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్న చందంగా ఒకే మండలంలో ఇద్దరు నేతలు ఉంటే అది సమస్య అవుతుందని బీజేపీ అధిష్టానం పరిగణించినట్టు సమాచారం. దీంతో అన్నామలైను పార్టీ అధ్యక్ష పదవిని నుంచి తప్పించే వ్యూహంతో ఉన్నట్టు ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో దక్షిణ తమిళనాడులో అన్నాడీఎంకేకు బలమైన నేతలు తక్కువే. అదే సమయంలో ప్రస్తుతం బీజేపీలో ఉన్న పూర్వపు అన్నాడీఎంకే నేత నైనార్ నాగేంద్రన్ దక్షిణ తమిళనాడులో బలం కలిగిన వ్యక్తి కావడంతో ఆయన్ను పార్టీ అధ్యక్ష పదవికి పరిశీలిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దక్షిణ తమిళనాడులో నైనార్ నాగేంద్ర, కొంగు మండలంలో పళణి స్వామి, ఉత్తర తమిళనాడులో మరోనేత అంటూ డీఎంకే మూడు వైపులా చుట్టుముట్టి గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు బీజేపీ అఽధిష్టానం వ్యూహ రచనలో ఉన్నట్టు బీజేపీ వర్గాలుపేర్కొంటున్నాయి. ఇందులో భాగంగా అన్నామలైను అధ్యక్ష పదవి తప్పించి, మరైదెనా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. సీనియర్లు అన్నామలైకు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ అధ్యక్ష మార్పు తథ్యమన్న చర్చ జోరందుకుంది. ఇందుకు అనుగుణంగా అన్నామలై సైతం స్పందించడం గమనార్హం. పార్టీ కోసం పదవిని త్యాగం చేయడానికి సిద్ధం అని అన్నామలై వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
బీజేపీలో చర్చ
నైనార్‌కు ఛాన్స్‌గా ప్రచారం
అన్నామలైకు పదవీ గండం


