చిరుతై చిత్ర కాంబో రిపీట్
తమిళసినిమా: పరుత్తివీరన్ చిత్రంతో కథానాయకుడిగా రంగప్రవేశం చేసిన కార్తీ. సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈయన తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత ఆయనకు కెరీర్ పరంగా వెనక్కి చుసుకునే అవకాశం లేకపోయింది. ఇటీవల తన 26 వ చిత్రం మెయ్యళగన్ చిత్రంతో మరో క్లాసికల్ హిట్ కొట్టిన కార్తీ ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు.ఈయన తాజాగా సర్ధార్ 2, వా వాథ్థియార్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది.కాగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ 2 చేయాల్సి ఉంటుంది. అదే విధంగా టాణాకారన్ చిత్రం ఫేమ్ తమిళ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి కమిట్ అయినట్లు ప్రచారంలో ఉంది. కాగా తాజాగా మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇంతకు ముందు శివ దర్శకత్వంలో కార్తీ చిరుతై అనే చిత్రంలో నటించారు. ఈయన ద్విపాత్రాభినయం చేసిన ఆ చిత్రం 2011లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. అది దర్శకుడు శివకు తొలి చిత్రం. ఆ తరువాత ఆయన నటుడు అజిత్ హీరోగా వరుసగా వీరం, వేదాళం,, వివేకం, విశ్వాసం మొదలగు నాలుగు హిట్ చిత్రాలు చేశారు. ఆ తరువాత రజనీకాంత్ కథానాయకుడిగా అన్నాత్తే, సూర్య హీరోగా కంగువ చిత్రాలు చేశారు. కంగువ చిత్రంలో కార్తీ గెస్ట్ రోల్ చేశారు. కాగా తాజాగా 14 ఏళ్ల తరువాత శివ దర్శకత్వంలో కార్తీ మరో సారి కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. కమర్షియల్ అంశాలతో యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రం కార్తీ ప్రస్తుతం నటిస్తున్న, అంగీకరించిన చిత్రాలు పూర్తి అయిన తరువాత సెట్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ హిట్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడానికి ఇంకా చాలా సమయం ఉంది.


