● సీపీఎం మహానాడులో సీఎం స్టాలిన్ ● కూటమిలో చీలికకు నో
సాక్షి, చైన్నె: మీలో సగం నేనూ అంటూ మార్కిస్టు నేతలను ఉద్దేశించి సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. మదురై వేదికగా 24వ సీపీఎం జాతీయ మహానాడు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం ఉమ్మడిపాలన– ఇండియా బలం అన్న నినాదంతో మహానాడు చర్చా కార్యక్రమం జరిగింది. ఇందులో సీపీఎం నేతలు ప్రకాష్ కారత్, షణ్ముగం, బాలకృష్ణన్, కేరళ సీఎం పినరాయ్ విజయన్, కర్ణాటక ఉన్నత విద్యా మంత్రి సుధాకర్, మదురై ఎంపీ వెంకటేషన్, తమిళనాడు మంత్రులు మూర్తి, పీటీఆర్ పళణి వేల్ త్యాగరాజన్, నటి రోహిణి, తదితరులు పాల్గొన్నారు. సీఎం ఎంకే స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ, ఉమ్మడి పాలనతో ఇండియాకు బలం అన్న ఈ నినాదం అందరీకీ ఆమోద యోగ్యమే అయినా, కేంద్రంలోని యూనియన్ ప్రభుత్వానికి అలర్జీగా అని ఎద్దేవా చేశారు. ఉమ్మడి పాలన అంటే వారికి అలర్జీ అన్నట్టుగా ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఉందన్నారు. సీపీఎం, డీఎంకే జెండాలలోని ఎరుపు రంగులను గుర్తు చేస్తూ, జెండాలోనే కాదు, ఇక్కడున్న వారందరీలోనూ తాము సగం భాగం అని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ,మార్కిస్టుల మధ్య సిద్ధాంత పరంగా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, అందుకే తమ బంధం అన్నది అనాదిగా కొనసాగుతున్నట్టు గుర్తు చేశారు. కమ్యూనిజంను ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ అప్పట్లోనే తమిళంలో తర్జుమా చేయించారని గుర్తుచేస్తూ, దివంగత నేత కరుణానిధి సైతం తనను ఓ కమ్యూనిస్టుగా చూపించుకున్నారని వివరించారు. కార్ల్ మార్క్స్‌కు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు చైన్నెలో ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ‘మీలో సగం నేను...నా పేరు స్టాలిన్’ అని వ్యాఖ్యలు చేశారు. ఈసందర్భంగా కరతాళ ద్వనులుమార్మోగాయి. సిద్ధాంతపరంగా అందరూ ఒక్కటే, అందరికీ అన్నీ... సమ సమాజం నిర్మాణం లక్ష్యంగా డీఎంకే ఎన్నికల కూటమి ఆవిర్భవించిందన్నారు.
మహానాడులో ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్, వేదికపై కేరళ సీఎం పినరాయ్ విజయన్, ప్రకాష్ కారత్ తదితర సీపీఎం నేతలు
మార్పు అన్నది మ్యాజిక్ కాదు..
మార్పు అన్నది ఒక్క సారిగా జరగదని, ఇది మ్యాజిక్ కాదు అని, ప్రాసెస్ అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని సూచించారు. 2019లో బయలుదేరిన ఈ కూటమి బంధం మేరకు లక్ష్యాలు, ఎవర్ని , ఎందుకు వ్యతిరేకించాలో అన్న దృక్పథంతో ముందుకెళ్తున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ కూటమిలో చీలిక రాదా..? అని అనేక మంది ఆశతో ఎదురు చూస్తున్నారని, అయితే వారి కల అన్నది నెరవేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇక్కడున్న వాళ్లు ఏ ఒక్కరూ అందుకు చోటు ఇవ్వరని వ్యాఖ్యానించారు. అనంతరం సీతారాం ఏచూరి పోరాటాలను గుర్తు చేస్తూ ఈప్రాంగణానికి ఆయన పేరు పెట్టడం మనస్సును పులకింప చేసిందన్నారు. ఉమ్మడి పాలనను అలర్జిగా మలుచుకుని రాష్ట్రాల హక్కుల కోసం గలం విప్పే వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న కేంద్రం చర్యలను సమిష్టిగా తిప్పి కొడుదామన్నారు. కేంద్రంలోని యూనియన్ ప్రభుత్వం రూపంలో తమిళనాడు సీఎంగా తాను, , పొరుగున, తన పక్కనే వేదిక మీదున్న కేరళ సీఎం పినరాయ్ విజయ్ అధిక నష్టాన్ని ఎదుర్కొంటున్నట్టు వ్యాఖ్యానించారు. రెండు మూడురోజుల్లో తమిళనాడుకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ సర్కారియాకమిషన్ సిఫార్సుల అమలు గురించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వివిధ చట్టాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను లాగేసుకుంటున్నారని, జీఎస్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక హక్కులను కాల రాశారని పేర్కొన్నారు. ఒక రాష్ట్ర అధికార పార్టీల రాష్ట్ర శాసనసభలలో ఆమోదించబడిన బిల్లులకు విరుద్ధంగా కేంద్రంలోని యూనియన్ ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయని మండి పడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను బెదిరిస్తున్నారని, అక్కడి పార్టీలను విచ్ఛిన్నం చేస్తున్నారని , పార్టీ మారమని బలవంతం చేస్తున్నారని పేర్కొంటూ, మరోమాటలో చెప్పాలంటే, రాష్ట్రాలు అస్సలు ఉండకూడదన్న భావనతో ఈ యూనియన్ పాలకులు ఉన్నారని ధ్వజమెత్తారు. లోక్ సభ నియోజకవర్గాలపునర్విభజన వ్యవహారంపై జాయింట్ యాక్షన్ కమిటీలో చేసిన తీర్మానంపై పీఎంకు తాను లేఖ రాసినట్టు గుర్తు చేశారు. అయితే, దీనిపై ప్రధాని ఇంకా స్పందించలేదన్నారు. భారతదేశంలో బిజెపికి ప్రత్యామ్నాయంగా ఒక సమాఖ్య వికసించి ఉందని, తద్వారా ప్రజాస్వామ్య శక్తులను సమీకరిస్తామని ప్రకటించారు. డీఎంకే, కమ్యూనిస్ట్ పార్టీలు ఒకే గొంతుకగా ఫాసిజాన్ని.. ఫాసిస్టులను ఒడించడమే లక్ష్యంగా ముందుకెళ్తాయని ధీమా వ్యక్తం చేశారు.


