మహిళా సంరక్షణపై కరపత్రాలతో అవగాహన
వేలూరు: కోవై నుంచి తిరుపతికి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో గర్భవతిపై గత మార్చి 7వ తేదీన ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటూ రైలు నుంచి కింద తోసి వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైలులో ప్రయాణం చేసే మహిళలకు రక్షణ కోసం రైలులో ఏమైనా సమస్యలు ఏర్పడితే పోలీసులకు వెంటనే సమాచారం అందజేసేందుకు వాట్సాఫ్ గ్రూపు ఏర్పాటు చేయాలని రైల్వే పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాట్పాడి రైల్వే పోలీసు ఇన్‌స్పెక్టర్ చిత్ర ఆధ్వర్యంలో ప్రత్యేక వాట్స్‌ఆఫ్ గ్రూపును ఏర్పాటు చేశారు. ఇందులో మహిళా ప్రయాణికులు, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు మొత్తం 210 మందితో కూడిన ప్రత్యేక గ్రూపును ప్రారంభించారు. వీటితో పాటూ మహిళా ప్రయాణికులకు ఏమైనా లైంగిక వేధింపులు జరిగినా వెంటనే సంబంధిత గ్రూపులోని నెంబర్‌కు వాట్సాప్‌లో సమాచారం అందజేస్తే వాటిపై వెంటనే చర్యలు తీసుకుంటామని అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం కరపత్రాలను రైల్వే ప్రయాణికులకు అందజేసి అవగాహన కల్పించారు. అదేవిధంగా రైలు బోగీలపై కరపత్రాలను అంటించారు. రైలు ప్రయాణం చేసే సమయంలో ప్రయాణికులు ఏమైనా ఇబ్బందులు జరిగినా వెంటనే సమాచారం అందజేయాలని కరపత్రాలను అందజేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్యామల, సుమతి, ఉషారాణి, పద్మరాజ, రైల్వే పోలీసులు పాల్గొన్నారు.


