పంగుణి బ్రహ్మోత్సవ శోభ
● కపాలీశ్వరాలయంలో ధ్వజారోహణం
● 10 రోజుల పాటూ వేడుక
సాక్షి, చైన్నె: చైన్నె మైలాపూర్‌లోని కపాలీశ్వరాలయంలో పంగుణి బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. గురువారం ఈ ఉత్సవాలకు వేడుకగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. పది రోజుల పాటూ ఉత్సవాలు వేడుకగా జరగనున్నాయి. వివరాలు.. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శివాలయాల్లో చైన్నె మైలాపూర్‌లోని కపాలీశ్వర ఆలయం కూడా ఒకటి. కపాలీశ్వరుడిగా పరమ శివుడు, కర్పగం అంబాల్‌గా పార్వతీ దేవి ఇక్కడ కొలువై ఉన్నారు. మయూరం తరహాలో కూర్చుని పార్వతీ దేవి శివుడి కోసం తపస్సు చేసిన ప్రదేశం ఇది అని, అందుకే దీనిని మైలాపూర్ అని పిలవడం జరుగుతోందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ పల్లవ రాజు హయాంలో నిర్మించబడినట్టు పేర్కొన బడింది. ఈ ఆలయంలో ఏటా ఇక్కడ పంగుణి ఉత్సవాలు అత్యంత వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. దీంతో ఆలయ పరిసరాలలో బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. ఈ ఏడాది ఉత్సవాలకు గురువారం ఉదయం ధ్వజారోహణం జరిగింది. ఉదయం నుంచి ఆలయంలో విశిష్ట పూజలను శివాచార్యులు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అలంకరణలు నిర్వహించారు. అనంతరం ఆలయం ఆవరణలో ధ్వజస్తంభం వద్ద పూజలు జరిగాయి. అభిషేకాది కార్యక్రమాలు జరిగాయి. గ్రామ దేవతకు జరిగిన పూజల తదుపరి ధ్వజారోహనం జరిగింది. ఈసమయంలో భక్తులు ధ్వజస్తంభంపై పుష్పాలను చల్లి శివ... శివ, నమ శివాయ అన్న నామస్మరణను మార్మోగించారు. మహాదీపారాదన జరిగింది.


