సినిమా పాటలు ప్రదర్శిస్తే చర్యలు
● హెచ్‌ఎంలకు పాఠశాల
విద్యా శాఖ హెచ్చరిక
సేలం: కృష్ణగిరి జిల్లా బర్గూర్ సమీపంలోని సోప్పనూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదుగురు విద్యార్థులు సినిమా పాటకు డాన్స్ చేశారు. ఒక విద్యార్థి వీరప్పన్ చిత్రం ఉన్న చొక్కాను పట్టుకుని, ఇద్దరు విద్యార్థులు పార్టీ దుస్తులు ధరించి పాల్గొన్నారు. ఈ డాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో విడుదలై పెద్ద వివాదానికి దారితీసింది. ఈక్రమంలో రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ శుక్రవారం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. అందులో 2024–2025 ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ అభ్యర్థన సందర్భంగా శాసనసభలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. దీంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ముందు విద్యార్థుల తమలోని కళలు, సాహిత్యం, క్రీడలు వంటి నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. ఇందుకుగాను రూ.15 కోట్ల కేటాయిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 2024–2025 విద్యాసంవత్సరం జరుపుకోవడానికి ప్రాథమిక విద్యా శాఖ సహా అన్ని జిల్లా ప్రాథమిక విద్యా అధికారులకు రూ. 15కోట్లు పంపిణీ చేసి, వేడుకలకు సంబంధించిన సూచనలు ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణగిరి జిల్లా బర్గూర్ సమీపంలోని చొప్పనూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల జరిగిన వార్షిక కార్యక్రమంలో కుల చిహ్నాలను ఉపయోగించి సినిమా పాటలు ప్లే చేసి, డాన్స్ చేసినట్లు వెల్లడైందని, ఇలాంటి వాటిని పూర్తిగా నివారించాలని, ఫిర్యాదులు వచ్చాయన్నారు. పాఠశాల వేడుకల్లో సినిమా పాటలను ప్రదర్శించినా, డాన్స్‌లు చేయించినా తమిళనాడు సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఫిర్యాదుకు లోబడి పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులపై చర్య తీసుకుంటారని హెచ్చరించారు. ఈ మేరకు సర్క్యులర్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ప్రాథమిక విద్యా అధికారులు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపారు.


