తమిళసినిమా: ఏ చిత్రం ఎప్పుడు ఎవరికి పేరు తెచ్చిపెడుతుందో తెలియదు. అలా అనూహ్య విజయాన్ని సాధించిన చిత్రం 96. ఈ చిత్రం ద్వారా చాయాగ్రాహకుడు ప్రేమ్ కుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇక ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి, త్రిష తొలి సారిగా జత కట్టారు. నటి గౌరీకిషన్, దేవదర్శిని, ఒడుగళం మురుగదాస్, బక్స్ పెరుమాళ్ ముఖ్యపాత్రలు పోషించారు. పాఠశాల విద్యార్థుల పరువ ప్రేమ, వారి రీ యూనియన్ వంటి కథాంశంతో రూపొందిన ఈ వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రం 2018లో తెరపైకి వచ్చి సూపర్‌హిట్ అయ్యింది. త్రిష నటన అందరినీ ఆకట్టుకుంది. దీంతో 96 చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు అధికారికంగా ప్రకటించారు. అది ఎప్పుడాని ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు చెప్పారు దర్శకుడు ప్రేమ్‌కుమార్. ఇటీవల కార్తీ హీరోగా మెయ్యళగన్ వంటి ఫీల్ గుడ్ కుటుంబ కథా చిత్రాన్ని చేసిన ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ 96 చిత్రానికి సీక్వెల్ కథ పూర్తి అయ్యిందని చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌న్స్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, 96 చిత్రంలో నటించిన వారంతా ఈ చిత్రంలో నటిస్తారని అన్నారు. కాగా ఈ చిత్రాన్ని వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో విజయ్‌సేతుపతి, త్రిష జంటను మరోసారి తెరపై చూడబోతున్నాం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.


