సాక్షి, చైన్నె: ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మిలన్ –2025 సాంస్కృతికోత్సవం శుక్రవారం ప్రారంభమైంది. నాలుగురోజుల పాటు జరగనున్న ఈ వేడుకలను సినీ నటుడు అధర్వ మురళి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 50వేల మంది విద్యార్థులను ఈ మిలన్ ఏకం చేసింది. మహోత్సవంలో 40కి పైగా క్లబ్ ఈవెంట్‌లు, రెండు అద్భుతమైన ప్రొఫెషనల్ షోలు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవం సందర్భంగా ఎస్‌ఆర్‌ఎం వ్యవస్థాపక చాన్స్‌లర్ డాక్టర్ టీఆర్ పారివేందర్ మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఉన్న తమ వర్సిటీలో ఈ వేడుక ప్రతి సంవత్సరం విజయవంతంగా జరుగుతోందన్నారు. మిలన్ 2025 విద్యార్థులతో నిర్వహించే ఒక ఉత్సవంగా నిలుస్తుందన్నారు. భారతీయ జానపద, శాసీ్త్రయ, ప్రపంచ సంగీత ప్రభావాల కలయికకు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన 15 మంది సభ్యుల రాక్ బ్యాండ్ అద్భుతమైన ప్రదర్శనతో ఉత్సవాలు ప్రారంభించామన్నారు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు తమన్ ఎస్‌తో పాటు భారతీయ పెర్కుషనిస్ట్ శివమణి, ఫ్లూటిస్ట్ నవీన్ కుమార్‌ల ప్రత్యేక షోలకు ఏర్పాట్లు చేశారు.


