● విషం సేవించి ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని
● చికిత్స పొందుతూ మృతి
సేలం : నీట్ పరీక్షలకు భయపడి మార్చి 31న విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన సేలం విద్యార్థి పరిస్థితి విషమించి గురువారం రాత్రి మృతి చెందింది. సేలం జిల్లా కొంగనాపురం సమీపంలోని పెరియ ముత్తియంపట్టి ప్రాంతానికి చెందిన సెల్వరాజ్, చంద్ర దంపతుల కుమార్తె సత్య(18). ఈమె పన్నెండవ తరగతిలో 562 మార్కులతో పాసైంది. ఆ తరువాత, జలకంఠాపురం ప్రాంతంలోని నీట్ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందింది. గత ఏడాది నిర్వహించిన నీట్ పరీక్షలో 333 మార్కులు మాత్రమే రావడంతో సత్య గత ఏడాది వైద్య కళాశాలలో చేరలేకపోయింది. అయితే, సత్య నీట్ పరీక్షకు సిద్ధమవుతూ వచ్చింది. ఈ పరిస్థితిలో, గత వారం, సత్య తన తల్లిదండ్రులతో నీట్ పరీక్షకు చదవడం చాలా కష్టంగా ఉందని చెప్పడంతో వేరే కోర్సు ఎంచుకోవచ్చని ఆమెను తల్లిదండ్రులు కూడా ఓదార్చారు. అయితే డాక్టర్ కావాలనే తన కల నెరవేరడం లేదనే మనస్తాపం చెందిన సత్య గత నెలాఖరున విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. పొరుగువారు ఆమెను రక్షించి, ఎడప్పాడి ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం సేలంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడి చివరకు గురువారం రాత్రి ఆమె కన్నుమూసింది. కొంగనాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీట్ పరీక్షపై ఆందోళనతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సేలంలో తీవ్ర విషాదాన్ని నింపింది.


