సేలం: కలెక్టర్ బంధువునని, ఒక కేసు నుంచి బయట పడేస్తానంటూ ఆడిటర్ నుంచి కోటి రూపాయలు వసూలు చేసిన ఓ లంచగొండి పోలీస్ ఇన్‌స్పెక్టర్ చివరకు కటకటాలపాలయ్యారు. పోలీసుల కథనం.. తంజావూరు జిల్లాలోని కులశేఖర నల్లూర్ ప్రాంతంలో కొల్లిడం నదిపై చెక్ డ్యామ్ నిర్మాణం కోసం రూ. 465 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం భూములను సేకరించింది. కుంభకోణం రామసామి కోవిల్ వీధికి చెందిన ఆడిటర్ రవిచంద్రన్ (68)కు చెందిన 80 సెంట్ల భూమిని కూడా చెక్ డ్యామ్ నిర్మాణానికి సేకరించి అతనికి పరిహారం సైతం ఇచ్చింది. ప్రభుత్వం సేకరించిన భూమిలో రవిచంద్రన్ 30 టేకు చెట్లను పెంచాడు. వాటిని రవిచంద్రన్ 2020లో నరికి, అమ్మకానికి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో జలవనరుల శాఖ అధికారులు ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ అధికారులకు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రవిచంద్రన్ నుంచి 3 టన్నుల బరువున్న 207 టేకు దుంగలను రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని కుంభకోణం రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి అప్పగించారు. అలాగే పందనల్లూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సాయం చేస్తానని రూ.కోటి స్వాహా!
ఈ నేపథ్యంలో అరియలూర్ జిల్లాలోని తిరుమంతురై నివాసి, ప్రస్తుతం ధర్మపురి జిల్లాలోని మహిళలపై నేరాల దర్యాప్తు విభాగంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నెపోలియన్ (45), రవిచంద్ర్‌న్ సంప్రదించి, టేక్ ఉడ్ కేసు నుంచి బయట పడటానికి తాను సాయం చేస్తానని, దీనికిగాను కోటి రూపాయలు ఇవ్వాలని కోరడంతో ఆ మేరకు సొమ్మును ఆడిటర్ ఇచ్చారు. అయినా ఆ తర్వాత కలప కేసులో రవిచంద్రన్ నిర్దోషిగా విడుదల కాలేదు. దీంతో అతను మళ్లీ నెపోలియనన్‌ను సంప్రదిస్తే మరింత డబ్బులకు డిమాండ్ చేయడంతో రవిచంద్రన్ అవాక్కయ్యాడు. ఆయన వాలకంపై అనుమానించి గత నెల తంజావూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ రాజారామ్ ఆదేశాలతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఇన్‌స్పెక్టర్ నెపోలియన్ లంచంగా రవిచంద్రన్ నుంచి కోటి రూపాయలు తీసుకున్నాడని, మరింత సొమ్ము డిమాండ్ చేశాడని తేలడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు.
కేసు నుంచి బయట పడేస్తానంటూ
ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ నిర్వాకం
మళ్లీ అదనపు సొమ్ము కోసం డిమాండ్
బాధితుడి ఫిర్యాదుతో అరెస్ట్


