● కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును రద్దు చేయాలని డిమాండ్
వేలూరు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక బిల్లుతో పాటు పెన్షనర్ల హక్కులను కాలరాచేలా ఉన్న బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలూరు ప్రధాన పోస్టల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాలో జిల్లా సమన్వయ కమిటీ అధ్యక్షులు కదీర్ అహ్మద్ నేతృత్వం వహించారు. జిల్లా కార్యదర్శి తంగవేలు, తమిళనాడు రిటైర్డ్ స్కూల్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కో–ఆర్డినేటర్ జనార్ధనన్ మాట్లాడారు. పెన్షనర్లకు వ్యతిరేకంగా ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు నోటిఫికేషన్‌ను పార్లమెంట్‌లో తేవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అదే విధంగా కొత్త పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పథకాన్ని అమలు చేయాలని తమ డిమాండ్లను నినదించారు. ధర్నా అనంతరం ప్రధాన పోస్టల్ కార్యాలయంలో ప్రధాన మంత్రికి వినతి పత్రాన్ని పోస్ట్ చేశారు. ధర్నాలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి లోకనాధన్, సిటీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు జ్ఞానశేఖరన్, పన్నీర్‌సెల్వం, నరసింహన్ పాల్గొన్నారు.


