ఐదుగురితో జాబితా!
● బీజేపీలో అధ్యక్ష ఎంపిక కసరత్తు
సాక్షి, చైన్నె: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కసరత్తులను అధిష్టానం మొదలెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఐదుగురు నేతలతో జాబితాను సిద్ధం చేసి ఢిల్లీకి పంపించి ఉన్నారు. ఇందులో ఒకరి పేరును పరిగణించి చైన్నెకు వచ్చే పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌లు ప్రకటించబోతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. వివరాలు.. బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలై ప్రస్తుతం వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, అన్నాడీఎంకేతో పొత్తు ప్రయత్నాలలో ఉన్న బీజేపీ పెద్దలు, ఆ పార్టీ విజ్ఞప్తికి అనుగుణంగా అన్నామలైను మార్చేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇది వరకు అన్నాడీఎంకేను తీవ్ర స్థాయిలో అన్నామలై విరుచుకు పడటం ఇందుకు కారణంగా చర్చ జరుగుతోంది. అన్నామలైను తప్పిస్తే కూటమిలోకి చేరేందుకు సిద్ధం అన్న సంకేతాన్ని గత నెల ఢిల్లీలో జరిగిన భేటీ సందర్భంగా అన్నాడీఎంకే నేతలు స్పష్టం చేసినట్టు చర్చ. ఇందుకు బలాన్ని చేకూర్చే విధంగా శుక్రవారం అన్నామలై స్పందించారు. కొత్త అధ్యక్షుడి రేసులో తాను లేనని స్పష్టం చేశారు. ఈ దృష్ట్యా, అన్నామలైను తప్పించేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కసరత్తులను మొదలెట్టి ఉన్నారు. ఈ మేరకు పార్టీ శాసన సభా పక్ష నేత నైనార్ నాగేంద్రన్ పేరు ఇది వరకు ప్రముఖంగా వినిపించినా, తాజాగా మరో నలుగురి పేర్లు తెర మీదకు వచ్చింది. మొత్తం ఐదుగురు నేతలతో జాబితాను సిద్ధం చేసి ఉన్నారు. ఇందులో ముందు వరుసలో సీనియర్ నేత పొన్ రాధాకృష్ణన్, ఆ తర్వాత నైనార్ నాగేంద్రన్ పేర్లు ఉండడం గమనార్హం. అలాగే మహిళా నేతలు తమిళిసై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్ పేర్లు పరిగణనలోకి తీసుకుని ఉండడం విశేషం. ఇక, పార్టీలో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న మురుగానందం, రామ శ్రీనివాసన్ పేర్లు కూడా జాబితాలో చేర్చడంతో ఈ ఐదుగురిలో అధ్యక్ష పదవి ఎవ్వరిని వరిస్తుందో అన్న ఎదురు చూపులు కమలనాథులలో నెలకొన్నాయి. సోమ లేదా మంగళవారం పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జ్, కో– ఇన్‌చార్జ్‌తో పాటూ ఢిల్లీ నుంచి అధిష్టానం పెద్దలు రానున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. అధ్యక్ష ఎంపిక కసరత్తులపై ఇక్కడి నేతలతో తుది చర్చ తదుపరి అధిష్టానం ఆదేశాలలో ఆ పదవి ఎవరిని వరిస్తుందో పెద్దలు ప్రకటించబోతున్నట్టు కమలాలయం వర్గాలు పేర్కొంటున్నాయి.


