రెడ్‌క్రాస్ సేవలు విస్తరింపజేయాలి
వేలూరు: రెడ్‌క్రాస్ సేవలు పట్టణ ప్రాంతాలకే అంకితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేసి ప్రజలకు సేవ చేసేందుకు ముందుకురావాలని వేలూరు వీఐటీ యూనివర్సిటీ చాన్స్‌లర విశ్వనాథన్ అన్నారు. వేలూరు ఇండియన్ రెడ్‌క్రాస్ సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాసన్ సేవలను అభినందించి రాష్ట్ర ప్రభుత్వం గత వారంలో తమిళ్ సేవా అవార్డును సీఎం స్టాలిన్ చేతులమీదుగా అందజేశారు. దీంతో కాట్పాడిలోని ప్రయివేటు కల్యాణ మండపంలో రెడ్‌క్రాస్ సభ్యులు అభినందన సమావేశం జిల్లా కార్యదర్శి జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీఐటీ చాన్స్‌లర్ హాజరై శ్రీనివాసన్‌కు జ్ఞాపికను అందజేసి ప్రసంగించారు. గత కరోనా కాలంలో రెడ్‌క్రాస్ సభ్యులు వేలూరు జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. నేటికి రక్తదానం, వైద్యశిబిరాలు వంటి సేవలు చేయడం అభినందనీయమన్నారు. నిజమైన పేదలను ఆదుకునేందుకే రెడ్‌క్రాస్ సంఘాన్ని ప్రారంభించారని వీటిలో మరిన్ని సభ్యులను చేర్చి సేవా కార్యక్రమాలను విస్తరింపజేయాలని కోరారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు దీనబంధు, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్, కుమరన్ ఆస్పత్రి చైర్మన్ మయిలాంబిగై కుమరగురు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఇక్రమ్, నారాయణ ట్రేడర్స్ యజమాని తంగవేలు, రెడ్‌క్రాస్ జాయింట్ కార్యదర్శి విజయకుమారి పాల్గొన్నారు.


