జీవీ హీరోగా ఇడిముళక్కం
తమిళసినిమా: సంగీత దర్శకుడు, కథానాయకుడు, నిర్మాత, గాయకుడు ఇలా బహు ముఖాలు కలిగిన నటుడు జీవీ ప్రకాష్‌కుమార్. ఈయన సంగీత దర్శకుడిగా సక్సెస్‌ఫుల్‌గా సెంచరీ కొట్టారు. నిర్మాతగా ఇటీవలే కింగ్‌స్టన్ చిత్రంతో తొలి అడుగు వేశారు. అయితే కథానాయకుడుగా పలు చిత్రాల్లో నటించినా, ఇంకా సరైన సక్సెస్ కోసం పోరాడుతూనే ఉన్నారని చెప్పవచ్చు. తాజాగా జీవీ కథానాయకుడిగా నటించిన చిత్రం ఇడి ముళక్కం. దీనికి శీను రామస్వామి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు తెన్మేర్కు పరువకాట్రు, నీరంతా పరవై, ధర్మదురై, మామణిధన్ వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారన్నది గమనార్హం. అదేవిధంగా ఇటీవల ఈయన దర్శకత్వం వహించిన కోళిపన్నై సెల్లదురై చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టినా, ఓటీటీలో మంచి ఆదరణ పొందింది. తాజాగా శీను రామస్వామి దర్శకత్వం వహిస్తున్న ఇడి మీళుక్కం జీవీ, శీను రామస్వామి కాంబోలో రూపొందుతున్న తొలి చిత్రం ఇది. ఇంతకుముందు కుటుంబ కథా చిత్రాలను తరకెక్కించిన శీను రామస్వామి తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న యాక్షన్, సస్పెన్‌న్స్ కథా చిత్రం ఇది కావడం విశేషం. ఉత్కంఠ భరితంగా సాగే యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంలో గాయత్రి నైతిక నటించారు. ఎన్‌ఆర్ రఘునందన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని స్కై మాన్ ఫిలిమ్స్ పతాకంపై కలైమగన్ ముబారక్ నిర్మించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొన్నారు. ఈ చిత్రం అయినా జీవీకి మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.


