పాంబన్‌ వంతెన.. ఓ అద్భుతం | - | Sakshi
Sakshi News home page

పాంబన్‌ వంతెన.. ఓ అద్భుతం

Apr 7 2025 10:06 AM | Updated on Apr 7 2025 10:06 AM

పాంబన్‌ వంతెన.. ఓ అద్భుతం

పాంబన్‌ వంతెన.. ఓ అద్భుతం

సాక్షి, చైన్నె: ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన రామనాథపురం జిల్లా రామేశ్వరంలో శ్రీరామ నవమి రోజైన ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. మదురై విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మండపానికి చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీకి రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌రవి, కేంద్ర సహాయమంత్రి ఎల్‌మురుగన్‌, రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ఆహ్వానం పలికారు. మండపం, రామేశ్వరం పరిధిలో గాల్లో హెలికాఫ్టర్‌ చక్కర్లు కొట్టి సమయంలో రాముడు నిర్మించిన వంతెన (రామసేతు)ను ప్రధాని వీక్షించారు. అనంతరం రామేశ్వరం రోడ్డు మార్గం వంతెన మీద నుంచి రూ. 550 కోట్లతో వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జిగా పాంబన్‌లో రూపుదిద్దుకున్న సముద్ర రైల్వే మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రిమోట్‌ సాయంతో ప్రారంభించారు. ఈ వంతెన వద్ద నౌకలు సముద్రంలో ప్రయాణించేందుకు వీలుగా నిర్మించిన ప్రత్యేక గేట్లను రిమోట్‌ ద్వారా తెరిచారు. ఈసమయంలో భారత నావికాదళం, కోస్టుగార్డు నౌకలు ఆ కొత్త వంతెన కింది భాగంలో సముద్రం వైపుగా అటు ఇటూ దూసుకెళ్లాయి. అలాగే, రామేశ్వరం టూ తాంబరం రైలు సేవకు జెండా ఊపారు.

రామ పాలనే ఆదర్శంగా..

ఈ వేదిక నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తమిళంలో యన్‌ తమిళ్‌ అన్బు సొందంగలే ( నా ప్రియ తమిళ ఆప్తులారా)అంటూ ప్రసంగాన్ని మొదలెట్టారు. పవిత్ర శ్రీరామ నవమి వేళ గత ఏడాది తాను ఇక్కడకు వచ్చినట్టు, ఆ తర్వాత అయోధ్యకు వెళ్లి రామాలయం ప్రారంభోత్సవ వేడుకలలో పాల్గొన్నట్టు గుర్తు చేశారు. శ్రీ రాముడి జీవితం, శ్రీరాముడి పాలనలోని మంచి ఉద్వేగ భరిత అంశాలు భారత దేశ నిర్మాణానికి ఆధారంగా, ఆదర్శకంగా ఉన్నట్టు వ్యాఖ్యలు చేశారు. తమిళ సంగ కాల సాహిత్యంలో శ్రీరాముడి గురించి పే ర్కొన్నారని వివరిస్తూ, రామేశ్వరం పవిత్ర భూమి అంటూ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. పాంబన్‌ వంతెనను ఒకప్పుడు గు జరాతీ ఒకరు నిర్మించినట్టు, ఇప్పుడు అదే గుజరాత్‌కు చెందిన తాను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. రామేశ్వరం భారత రత్న అబ్దుల్‌ కలాం భూమి అని, ఇది విజ్ఞాన, ఆథ్యాత్మిక మేళవింపు అంటూ, ప్రస్తుతం పాంబన్‌ వంతెన ఆధునిక సాంకేతికత, పారంపర్య మేళవింపుగా రూపుదిద్దకున్నట్టు వివరించారు. దేశంలోనే ఇది తొలి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జి ఇది అని పేర్కొంటూ, వివిధ రాష్ట్రాలలో వున్న ప్రముక భారీ వంతెనల గురించి ప్రస్తావించారు. రామేశ్వరం టూ చైన్నెకు మాత్రమే కాదు, దేశంలోని పలు నగరాలకు రైలు సేవలను విస్తరిస్తామన్నారు. తద్వారా తమిళనాడు పర్యాటకంగా, ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందన్నారు.

పదేళ్లల్లో నిధుల వరద..

తమిళనాడుకు గత పది సంవత్సరాలలో రైలు, రోడ్డు, హార్బర్‌, విమాశ్రయాలు, విద్యుత్‌, నీళ్లు, గ్యాస్‌ పైప్‌ లైన్లు అంటూ ఎన్నో ప్రగతి ప్రాజెక్టులకు నిధులను హోరెత్తించామన్నారు. వందే భారత్‌, అమృత్‌ భారత్‌, నమో భారత్‌ రైళ్ల ఆధునీకరణ, బుల్లెట్‌ రైలు సేవల కసరత్తులు వేగం పెంచామన్నారు. దేశంలో అన్ని ప్రాంతాల మధ్య కనెక్టివిటీ లక్ష్యంగా, అభివృద్ధికి మార్గం బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్నామన్నారు. విక్షిత్‌ భారత్‌ వైపు సాగుతున్న ప్రయాణంలో దేశ ప్రగతికి తమిళనాడు కీలక భాగస్వామ్యంగా ఉందని వివరించారు. తమిళనాడు సామర్థ్యం పెరిగిందని, అభివృద్ధి వేగవంతమైందని, తమిళనాడు ఆర్థిక ప్రగతి, పారిశ్రామిక పగతికి తోడ్పాటు రెట్టింపు అయిందని వివరించారు. దేశ ప్రగతిలో తమిళనాడు పాత్ర కీలకం అని పేర్కొంటూ, అందుకే కేంద్రం ప్రత్యేక దృష్టితో నిధులను కేటాయిస్తూ వస్తోందన్నారు. గత పది సంవత్సరాలలో వివిధ పథకాలు, ప్రాజెక్టులకు జరిగిన నిధుల కేటాయింపును గురించి వివరించారు. అయితే ఇందుకు భిన్నంగా కొందరు కన్నీళ్లు కారుస్తున్నారని, ఏడ్చే వాళ్లు ఎడవ నీయండి అంటూ డీఎంకే పాలకును ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

తమిళంలో వైద్య కోర్సులు

అందరికీ నాణ్యమైన, ఉన్నత మైన వైద్యం దిశగా చర్యలు విస్తృతం చేశామని ప్రస్తావిస్తూ, తమిళనాడులోని విద్యార్థులు వైద్య కోర్సును వారి మాతృ భాషలోనే చదువుకునే విధంగా ప్రత్యేక ప్రయత్నం జరుగుతున్నదన్నారు. తమిళంలో పాఠ్యాంశాల రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. జాలర్ల సంక్షేమం లక్ష్యం అని, వారి భద్రతకు భరోసా ఇస్తున్నట్టు పేర్కొంటూ, ఇప్పటి వరకు శ్రీలంక చెర నుంచి తాము విడుదల చేయించిన వారి వివరాలను వెల్లడించారు. మత్స్య సంపద పెంపునకు చేపట్టిన విస్తృత చర్యలను ప్రస్తావించారు. అలాగే, ఈ రాష్ట్రం నుంచి తనకు ఆంగ్లంలో లేఖలు వస్తుంటాయని, అయితే, ఇందులో సంతకం మాత్రం ఆంగ్లంలో ఉండటం విస్మయానికి గురి చేస్తున్నదన్నారు. తమిళ స్వరం, గళం అనే వారు తమిళంలో సంతకం పెట్టరూ? అంటూ పరోక్షంగా సీఎం స్టాలిన్‌కు హితవు పలికారు. తమిళ సంస్కృతి. సంప్రదాయం, భాష ప్రపంచ దేశాలలో విరాజిల్లాలన్న కాంక్షతో తన ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఇదే రోజు అని ప్రస్తావిస్తూ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజలకు సుపరిపాలన అందించే అవకాశం తమకు దక్కిందని, తమ పాలన తీరును ప్రజలు పరిశీలిస్తున్నారని, దేశ ప్రయోజనాల మీద దృష్టి పెడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. చివరగా తమిళనాడు ప్రగతి పథకాలకు సంపూర్ణ సహకారం, మద్దతు , శుభాకాంక్షలు అంటూ మీండూం సంధిప్పోం ( మళ్లీ కలుద్దాం) అన్న తమిళ వ్యాఖ్యతో ప్రసంగాన్ని ముగించారు.

దేశానికి అంకితం చేసిన ప్రధాని మోదీ

రైలు సేవకు శ్రీకారం

దేశ ప్రగతిలో కీలకంగా తమిళనాడు

సంతకాలు తమిళం పెట్టాలని

నేతలకు సూచన

రాష్ట్రానికి గత పదేళ్లల్లో భారీగా

నిధులిచ్చామని స్పష్టీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement