త్యాగరాజ సన్నిధిలో రథోత్సవం
– భక్త జన సంద్రమైన తిరువారూర్
సాక్షి, చైన్నె: తిరువారూర్‌లోని త్యాగరాజ స్వామి ఆలయంలో వార్షిక బ్రహోత్సవాలలో భాగంగా సోమవారం రథోత్సవం వైభవంగా సాగింది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద రథోత్సవ వైభవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తిరువారూర్ వైపు పోటెత్తారు. రాష్ట్రంలోని పురాతన, ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో తిరువారూర్ జిల్లా కేంద్రంలో వెలిసిన త్యాగరాజ స్వామి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా మార్చిలో ఆలి రథోత్సవంతోపాటు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మూలవిరాట్‌గా త్యాగ రాజేశ్వర స్వామి, వన్నిగనాఽథర్ పేరిట పరమ శివుడు కొలువై ఉన్నాడు. ఇక్కడి ఉత్సవ మూర్తిని నిధి విడంగర్‌గా కూడా భక్తులు పిలుస్తుంటారు. తొమ్మిది రాజగోపురాలతో దేదీప్యమానంగా కనిపించే ఈ ఆలయంలోని రథం ఆసియా ఖండంలోనే అతి పెద్దది. 96 (29 మీటర్ల) అడుగుల ఎత్తుతో 350 టన్నుల బరువుతో ఈ రథం గాంభీర్యంగా భక్తులకు కనిపిస్తుంటుంది. ఈ రథాన్ని లాగుతున్నట్టుగా ఉండే నాలుగు గుర్రపు విగ్రహాలు ఒక్కొక్కటి 11 అడుగుల ఎత్తులో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంటాయి. తిరుచ్చి భెల్ సంస్థ ఆలి తేర్ రథాన్ని ఇటీవల ఆధునీకరించి హైడ్రాలిక్ బ్రేక్‌ను అమర్చింది. ఈ పరిస్థితులలో గత నెల 13వ తేదీ పంగుణి ఉత్సవం ఇక్కడ ప్రారంభమైంది. 15వ తేదీ ధ్వజారోహణం నిర్వహించారు.
రథోత్సవ కోలాహలం
వేకువ జాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఐదున్నర గంటలకు వినాయకుడు, సుబ్రమణ్య స్వామి రఽథాలు, ఆలి రథం ముస్తాబైంది. స్వామి వారు రథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు. ఉదయం 9.10 గంటలకు కలెక్టర్ మోహన చంద్రన్, ఎస్పీ కరుణాకర్, ఎమ్మెల్యే కలైవాణన్, బీజేపీ సీనియర్ నేత హెచ్.రాజా తదితరులు రథాన్ని లాగారు. అనంతరం ఆలయ తూర్పు రథ వీధి వద్ద ప్రారంభమైన ఈ రథోత్సవం సోమవారం రాత్రి తిరిగి యథాస్థానానికి చేరుకుంది. ఆలి తేర్ రథం వెనుక అమ్మవారు, చండికేశ్వరర్ రథాలు కదిలాయి. వేలాదిగా భక్తులు తరలి వచ్చి రథాన్ని లాగారు.


