వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలహోరు
సాక్షి, చైన్నె: వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆదివారం నిరసనలు హోరెత్తాయి. తౌఫిక్ జమాత్ , నామ్ తమిళర్ కట్చి, ఉలామాక్కల్ సమాఖ్యల నేతృత్వంలో వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. వక్ఫ్ చట్ట సవరణ ముసాయిదా పార్లమెంట్ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా ఆదివారం నామ్‌తమిళర్ కట్చి నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమాలు జరిగాయి. చైన్నెలో జరిగిన నిరసనలో ఆపార్టీ కన్వీనర్ సీమాన్ పాల్గొని వక్ఫ్ ఆస్తులన్నీ అల్లాకే సొంతం అని వ్యాఖ్యలు చేశారు. వక్ఫో బోర్డు చట్ట వ్యవహారంలో డీఎంకే,అన్నాడీఎంకే నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ఈరెండుపార్టీలను చీల్చి చెండాడేందుకు తాను సిద్ధమని, త్వరలో ఇది జరుగుతుందన్నారు. ఇక, తౌఫిక్ జమాత్ నేతృత్వంలో అన్ని నగర కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. వక్ఫ్ చట్ట రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు అని ఆ జమాత్ నేతలు స్పష్టంచేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలలో నిరసన సభలరూపంలో ఆదివారం సాయంత్రం ఉలామాక్కల్ ఇయక్కం నేతృత్వంలో ఆందోళనలు జరిగాయి. మత పెద్దలు, ఉలామాక్కల్ పెద్దసంఖ్యలో తరలి వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగానినాదాలు హోరెత్తించారు. ఆ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పదని హెచ్చరించారు. చైన్నె ఎగ్మూర్‌లోని రాజరత్నం స్టేడియం ఆవరణలోజరిగిన నిరసనకు వేలాదిగా మైనారిటీలు తరలి వచ్చి తమ వ్యతిరేకతను వ్యక్తంచేస్తూ కేంద్రం తీరును ఎండగట్టే విధంగా నినాదాలు చేశారు. అలాగే తమిళ వెట్రి కళగంనేత విజయ్ ఆదేశాలతో పలు చోట్ల నిరసనలు హోరెత్తాయి.
కోర్టులో విజయ్ పిటిషన్
వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా తమిళగ వెట్రి కళగం నేత విజయ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు పార్టీలు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాయి. ఈ చట్టానికి వ్యతిరేకంగా పదికి పైగా కేసులుసుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ పరిస్థితుల్లో విజయ్ సైతం ఆదివారం కోర్టులోపిటిషన్ వేశారు. అత్యవసర పిటిషన్‌గా విచారించాలని కోరుతూ మంగళవారం సుప్రీంకోర్టులో స్వయంగా హాజరయ్యేందుకు విజయ్ తరపున న్యాయవాదులు సిద్ధమయ్యారు. రాష్ట్రపతి సంతకం పెట్టేలోపు ఈ సవరణ చట్టాన్ని నిలుపుదల చేయించడమే లక్ష్యంగా విజయ్ వక్ఫ్ వ్యతిరేకత నినాదం అందుకున్నారు. పార్టీ ఆవిర్భావం తదుపరి తొలిసారిగా మైనారిటీ ప్రజల పక్షాన నిలబడి న్యాయపోరాటానికి విజయ్ సిద్ధం కావడం గమనార్హం.


