నేనంటే.. నేనే.. అధ్యక్షుడ్ని!
● అన్భుమణి స్పష్టీకరణ ● సంబరాలలో మద్దతు దారులు ● సర్వసభ్య సమావేశానికి రాందాసు కసరత్తు ● తారాస్థాయికి తండ్రి, తనయుడి వార్
పీఎంకేకు అధ్యక్షుడెవరు అన్న వివాదం తారాస్థాయికి చేరింది. నేనే అధ్యక్షుడి అంటూ రాందాసు...కాదా..కాదు నేనే అంటూ అన్బుమణి మధ్య వార్ మరింత రసవత్తరంగా ముందుకు సాగుతోంది. ఈ పరిణామాలతో పీఎంకే ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. ఓ వైపు తైలాపురంలో రాందాసును, మరో వైపు అక్కరైలో అన్బుమణిని బుజ్జగించే విధంగా మంతనాలలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఈ వివాదాలన్నింటికీ కేంద్ర బిందువుగా భావిస్తున్న రాందాసు మనవడు, అన్బుమణి మేనళ్లుడు ముకుంద్ పరశురాం సైతం రంగంలోకి దిగడం గమనార్హం.
సాక్షి, చైన్నె: గత ఏడాది జరిగిన పీఎంకే సర్వ సభ్య భేటీ పార్టీ వ్యవస్థాపకుడు, తండ్రి రాందాసు, పార్టీ అధ్యక్షుడు తనయుడు అన్బుమణి మధ్య వివాదాన్ని తెర మీదకు తెచ్చిన విషయం తెలిసిందే. తన కుమార్తె పెద్దకుమారుడు, మనవుడైన ముకుంద్ పరశురాంను పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా రాందాసు ప్రకటించడాన్ని అన్భుమణి తీవ్రంగా వ్యతిరేకించారు. తన మేనళ్లుడి నియామకానికి వ్యతిరేకంగా అన్బుమణి తీవ్ర గళాన్ని విప్పడంతో ప్రారంభమైన వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు పీఎంకే వర్గాలు తీవ్రంగా కుస్తీలు పట్టాయి. యువజన అధ్యక్ష పదవిని ఇంత వరకు ముకుంద్ పరశురాం చేపట్టక పోవడంతో వివాదం సమసినట్లయ్యింది. ఈ పరిస్థితులలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చైన్నెకు వచ్చేందుకు ఒక రోజు ముందుగా పీఎంకేలో హఠాత్తుగా కల్లోలం బయలు దేరింది. అన్బుమణిని అధ్యక్ష పదవి నుంచి రాందాసు తొలగించడం చర్చకు దారి తీసింది. ఎన్‌డీఏ కూటమిలో పీఎంకే ఉందా? అన్న చర్చకు సైతం ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తండ్రి, తనయుడి మధ్య మళ్లీ బయలుదేరిన వార్‌ను సద్దుమణిగేలా చేయడానికి గత రెండు మూడు రోజులుగా పీఎంకే ముఖ్యులు కుస్తీలు పడుతున్నారు.
తైలాపురం టు అక్కరై మధ్య పరుగు
నేనే అధ్యక్షుడ్ని అని రాందాసు ప్రకటిస్తే. కాదు. కాదు నేనే అధ్యక్షుడ్ని అంటూ అన్బమణి తాజాగా ప్రకటించుకున్నారు. పార్టీ సర్వ సభ్య సభ్యులతో ఎన్నికై న తనను తొలగించే అధికారం ఎవ్వరికీ లేదంటూ అన్బుమణి ప్రకటించడం చర్చకు దారి తీసింది. అధ్యక్షుడిగా తానే కొనసాగుతున్నట్టు స్పష్టం చేశారు. దీంతో ఆదివారం పలు చోట్ల పీఎంకే వర్గాలు బాణాసంచా పేల్చుతూ అన్బుమణికి మద్దతుగా నినాదాలు హోరెత్తించారు. తండ్రి, తనయుడి మధ్య బయలుదేరి వార్ తారా స్థాయికి చేరడంతో పార్టీకి తీవ్ర నష్టం తప్పదన్న విషయాన్ని పీఎంకే వర్గాలు గ్రహించినట్టున్నాయి. అదే సమయంలో ఎత్తుకు పై ఎత్తు అన్నట్టుగా రాందాసు సైతం వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకడమే లక్ష్యంగా పీఎంకే నేతలు కొందరు తైలాపురంలో, మరికొందరు చైన్నె శివారులోని అక్కరైలో తిష్ట వేశారు. తైలాపురంలో రాందాసును బుజ్జగించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అరియలూరు, పెరంబలూరు, విల్లుపురం, తదితర జిల్లాలకు చెందిన నేతలందరూ తైలాపురంకు చేరుకున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షుడు జీకే మణి సైతం రాందాసు వెన్నంటి తైలాపురంలో ఉండడం గమనార్హం. అన్బుమణి ప్రకటనను రాందాసు తీవ్రంగా పరిగణించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించి అన్బుమణి అధికారికంగానే అధ్యక్ష పదవి నుంచి తొలగించి, ఆ పదవిని సర్వసభ్య సభ్యుల మద్దతుతో చేజిక్కించుకునేందుకు రాందాసు సిద్ధమైనట్టు చర్చ ఊపందుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ గౌరవ అధ్యక్షుడు జీకేమణి మీడియాతో మాట్లాడుతూ, త్వరలో మంచి సమాచారం వస్తుందన్నారు. తండ్రి, తనయులను ఒకే వేదిక మీదకు తీసుకొస్తామని, ఇద్దరు మున్ముందురోజులలో కలిసి పనిచేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. త్వరలో మంచి సమాచారం వస్తుందన్నారు. అదే సమయంలో మైలం ఎమ్మెల్యే శివకుమార్, విల్లుపురం లల్లా కార్యదర్శి జయరాజ్‌తో కలిసి అన్నాడీఎంకే నేత, చైన్నె మాజీ మేయర్‌ౖ సైదె దురైస్వామి రాందాసుతో భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. అయితే తమ భేటీ మర్యాద పూర్వకం అని ౖసైదె దురై స్వామి ప్రకటించారు.
రంగంలోకి ముకుందన్
పీఎంకే యువజన అధ్యక్షుడిగా ఎంపికై నా ఇంత వరకు బాధ్యతలు స్వీకరించని ముకుంద్ పరశురాం తాజా వివాదం నేపథ్యంలో రంగంలోకి దిగారు. పార్టీలో తాన రాకతోనే వివాదం చోటు చేసుకోవడం, తన రూపంలో తాతయ్య, మేనమామ మధ్య వివాదం ముదరడం వంటి పరిణామాలను ఆయన తీవ్రంగానే పరిగణించినట్టు సమాచారం. దీంతో పార్టీ సీనియర్ న్యాయవాది బాలుతో కలిసి ఆదివారం చైన్నె శివారులోని అక్కరైలోని అన్బుమణి నివాసానికి వెళ్లడం ప్రాధాన్యతకు దారి తీసింది. అన్బుమణి బుజ్జగించే విధంగా ఈ మంతనాలు జరిగినట్టు సమాచారం. మరికొందరు ముఖ్య నేతలు సైతం అన్బుమణితో మాట్లాడినానంతరం రాందాసుతో భేటీ నిమిత్తం తైలాపురానికి బయలుదేరి వెళ్లినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో అన్బుమణి తానే అధ్యక్షుడ్ని అని ప్రకటించడంతో ఆదివారం ఆయన మద్దతుదారులు అనేక చోట్ల బాణసంచా పేల్చుతూ సంబారాలు చేసుకున్నారు. అలాగే పార్టీ వ్యవహారంపై సోమవారం తాను ప్రత్యేకంగా మీడియా భేటీ ఏర్పాటు చేయనున్నట్టు అన్బుమణి ప్రకటించడంతో పీఎంకే వివాదాలకు శుభం కార్డు పడేనా? లేదా ఏదేని ట్విస్టుతో ముందుకు సాగేనా? అన్నది వేచి చూడాల్సిందే.


