జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడుల్లో ఇద్దరు తమిళుల మృతి?
సాక్షి, చైన్నె: కాశ్మీర్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకుల్లో ఇద్దరు తమిళులు ఉన్నట్లు సమాచారం. అలాగే ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు గుర్తించారు. వీరిలో చైన్నెకు చెందిన చందు, పరమేశ్వర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వీరు అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నట్లు కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన వారి బంధువులు చైన్నెకి సమాచారం అందించారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం స్టాలిన్ ఉగ్రదాడిని ఖడించారు. ఢిల్లీలోని తమిళనాడు అధికారులను అప్రమత్తం చేసి ఘటనా స్థలానికి వెళ్లాలని సూచించినట్లు సమాచారం. అలాగే కాశ్మీర్ ఉగ్రదాడిని తమిళనాడు ప్రతిపక్ష నేత పళణిస్వామి కూడా తీవ్రంగా ఖండించారు. బాధితులకు తక్షణ సహాయం అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
యూపీఎస్సీలో తమిళ తేజం
● జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు
సాక్షి, చైన్నె: నాన్ మొదల్వన్ పథకం ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థి యూపీఎస్సీ పరీక్షలలో జాతీయ స్థాయిలో 23వ స్థానం, తమిళనాడులో తొలి స్థానం దక్కించుకున్నారు. అతడిపేరు బీ శివచంద్రన్. మంగళవారం వెలువడ్డ యూపీఎస్సీ ఫలితాల ర్యాంకింగ్స్‌లో ఘనత సాధించిన శివచంద్రన్‌కు ప్రశంసలు హోరెత్తుతున్నాయి. సీఎం ఎంకే స్టాలిన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాన్ మొదల్వన్ పథకం తమిళ విద్యార్థులకు, పోటీ పరీక్షలలో పాల్గొనే అభ్యర్థులకు ఏ మేరకు ఉపయోగకరంగా మారిందో తాజాగా విడుదలైన యూపీఎస్సీ ఫలితాలు నిరూపించాయని ధీమా వ్యక్తం చేశారు. శివచంద్రన్ జాతీయ స్థాయిలో 23వ స్థానం, తమిళనాడు స్థాయిలో మొదటి స్థానం దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఆనందం తన ఒక్కడిదే కాదని, యావత్ తమిళనాడుది అని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నాన్ మొదల్వన్ ప్రాజెక్టులో శిక్షణ పొంది యూపీఎస్సీలో జాతీయ స్థాయి ర్యాంకింగ్‌లో నిలబడ్డ మొదటి వ్యక్తి శివచంద్రన్ అని వ్యాఖ్యానించారు. ఈ పథకం వేలాది మంది విద్యార్థుల నైపుణ్యాలను మెరుగు పరస్తున్నట్టు, లక్షలాది మంది భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తున్నట్టు హర్షం వ్యక్తం చేశారు. కాగా, శివచంద్రన్ జాతీయ స్థాయి ర్యాంకుల జాబితాలో చోటు దక్కించుకోగా, నాన్ మొదల్వన్ పథకం మేరకు శిక్షణ పొందిన వారిలో కామరాజ్, శంకర పాండి రాజ అనే మరో ఇద్దరు సైతం రాష్ట్ర స్థాయి ర్యాంకుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. నాన్ మొదల్వన్ పథకం మేరకు 134 మంది శిక్షణలో ఉండగా 50 మంది పరీక్షలకు హాజరైనట్టు, ఇందులో 18 మంది తమ ప్రతిభను చాటి ఉత్తీర్ణులైనట్టుగా అధికారులు పేర్కొంటున్నారు.
పింఛన్ పెంపునకు డిమాండ్
సాక్షి,చైన్నె: దివ్యాంగులు, ప్రత్యేక ప్రతిభావంతులు తమకు పింఛను పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చైన్నెలో పది చోట్ల ఆందోళనకు దిగారు. వీరిని అడ్డుకోవడం పోలీసులకు శ్రమగా మారింది. వివరాలు.. తమిళనాడులో దివ్యాంగులు తదితరులకు నెలకు రూ. 1500 ఫించన్ అందజేస్తున్నారు. అయితే, ఇతర రాష్ట్రాల తరహాలో తమకు సైతం పింఛన్ పెంచాలన్న నినాదాన్ని కొన్ని సంఘాలు అందుకున్నాయి. అలాగే, తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి జట్టులు జట్టులుగా బస్సులలో చైన్నెకు ఉదయాన్నే చేరుకున్నారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక మేరకు సచివాలయం వైపుగా దూసుకెళ్లేందుకు వ్యూహరచన చేశారు. అయితే వీరి ఆందోళనను పసిగట్టిన నిఘా వర్గాలు పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో కోయంబేడు బస్టాండ్, కామరాజర్ సాలై, సచివాలయం వైపుగా వెళ్లే మార్గంలో భద్రతను పటిష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వీరి ఆందోళనలను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. ఉదయాన్నే కోయంబేడుకు ధర్మపురి, కృష్ణగిరి, తిరువణ్ణామలై జిల్లా నుంచి జట్లు జట్లుగా ప్రభుత్వ బస్సులలో వచ్చిన 250 మందిని బస్టాండ్‌లోని అడ్డుకున్నారు. తమను అరెస్టు చేయవద్దంటూ ప్రత్యేక ప్రతిభావంతులు, దివ్యాంగులు బస్టాండ్ ఆవరణలో బైటాయించి ఆందోళనకు దిగారు. వీరిని బలవంతంగా అరెస్టు చేయలేని పరిస్థితి నెలకొంది. చివరకు పోలీసులు వీరందర్నీ అదుపులోకి తీసుకున్నారు. కామరాజర్ సాలైలలో ఓ బృందాన్ని, ఉత్తర చైన్నె పరిధిలో మరో బృందాన్ని, అన్నా సాలైలలో ఇంకో బృందం అంటూ పది చోట్ల నిరసనకు దిగిన వారందర్నీ పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం మార్గంలో భద్రతను మరింతగా కట్టుదిట్టం చేసి, అటువైపుగా ప్రత్యేక ప్రతిభావంతులు ఎవ్వరు రాకుండా అప్రమత్తంగా వ్యవహరించారు.
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడుల్లో ఇద్దరు తమిళుల మృతి?


