
మన్ కీ బాత్‌కు అడ్డంకులు
● బీజేపీ వర్గాల ఆగ్రహం ● ఆగమేఘాలపై మరో చోటకు మార్పు
సాక్షి, చైన్నె: ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి పోలీసులు చైన్నెలో అడ్డుకట్ట వేశారు. ఎలాంటి అనుమతులు పొందకుండా మరోచోటకు మకాం మార్చాల్సి వచ్చింది. నడిరోడ్డులో ఏర్పాట్లు చేయడాన్ని అడ్డుకున్నారు. ఆగమేఘాలపై నిర్వాహకులు మకాం మరోచోటుకు మార్చుకున్నారు. వివరాలు.. ప్రతి నెలా చివరి ఆదివారంలో మన్‌కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలను ఉద్దేశించి పీఎం మోదీ మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ప్రజలు వీక్షించేందుకు వీలుగా బీజేపీ వర్గాలు చైన్నెలో ఏర్పాట్లు చేశాయి. చైన్నె నడుకుప్పం పరిధిలో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, మహిళా నేత, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్‌తో పాటుగా ముఖ్య నేతలు హాజరు అయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఎలాంటి అనుమతి అన్నది పొందకుండా రోడ్డు మీద ఏర్పాట్లు చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. మెరీనా తీరంలోని అవ్వయార్ విగ్రహం ఎదురుగా ఉన్న నెడు కుప్పం రోడ్డులో చేసిన ఏర్పాట్లను అడ్డుకున్నారు. అనుమతి పొందకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ వర్గాలపై చర్యకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ వర్గాలు ఆందోళనకు సిద్ధమయ్యారు. చివరకు పోలీసు వర్గాలు మన్ కీ బాత్ ను ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల ఏర్పాట్లన్నింటిని తొలగించారు. అక్కడకు వచ్చే జనానికి పంపిణి నిమిత్తం సిద్ధం చేసిన ఆహారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. చివరకు అక్కడి నుంచి సమీపంలోని కల్యాణ మండపంకు బీజేపీ వర్గాలు మకాం మార్చుకోవాల్సి వచ్చింది. ఆహారాన్ని పోలీసులు అప్పగించడంతో మధ్యాహ్నం అక్కడకు వచ్చిన వారికి పసందైన విందును బీజేపీ వర్గాలు ఏర్పాట్లు చేశాయి. పోలీసుల తీరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తీవ్రంగా ఖండించారు. తొలి సారిగా మన్‌కీ బాత్ కార్యక్రమానికి అధ్యక్ష హోదాలో వచ్చిన నైనార్‌ను ఘనంగా బీజేపీ నేతలు సత్కరించారు. తొలుత హిందీలో తర్వాత తమిళంలో మన్ కీ బాత్ ప్రసంగాన్ని ప్రసారం చేశారు.