వేలూరు: కాట్పాడి రైల్వే స్టేషన్‌లో గంజాయి, గుట్కా తదితర మత్తు పదార్థాలు తరలించకుండా రైల్వే పోలీసులు వివిధ నివారణ చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో బిహార్ రాష్ట్రం పాట్నా నుంచి కేరళ రాష్ట్రం ఎర్నాకులం వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం ఉదయం కాట్పాడి రైల్వే స్టేషన్‌కు వచ్చింది. దీంతో కాట్పాడి రైల్వే పోలీస్ ఇన్‌స్పెక్టర్ చిత్ర ఆధ్వర్యంలో రైల్వే పోలీసులు రైలులోని బోగీలలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో జనరల్ కంపార్టుమెంట్‌లోని మరుగుదొడ్డిలో అనుమానాస్పదంగా ఒక బ్యాగు ఉండడాన్ని గమనించిన పోలీసులు తనిఖీ చేశారు. అందులో సుమారు ఆరు కిలోల గంజాయి రెండు బాక్సులుగా ఉన్నట్లు గుర్తించారు. ఆ గంజాయిని ఎవరు తరలించారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రైల్వే పోలీసులు గంజాయిని మాత్రం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఈ గంజాయి తరలింపుపై విచారణ చేస్తున్నారు.
ఘనంగా పశువైద్య దినోత్సవం
పళ్లిపట్టు: ప్రపంచ పశుసంవర్ధక వైద్య దినోత్సవం సందర్భంగా పళ్లిపట్టులో ఆదివారం వేడుకలు నిర్వహించారు. స్థానిక పశు సంవర్ధక కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి తిరుత్తణి డివిజన్ పశుసంవర్ధక శాఖ సహాయ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్ అధ్యక్షత వహించారు. తిరుత్తణి, ఆర్కేపేట, పళ్లిపట్టు మండలాలకు చెందిన పశు సహాయ వైద్యులు పాల్గొన్న కార్యక్రమంలో పాడి రైతుల కోసం నిరంతరం సహాయకాలు అందించాలన్నారు. మూగజీవులకు ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించి రైతుల జీవితాల్లో ఆర్థిక ప్రగతికి చేదోడుగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వైద్యులు అందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో పాడి రైతులు పాల్గొని పశువైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
గంజాయి ప్యాకెట్లు స్వాధీనం


