
అన్నాచెల్లెళ్ల ఇతివృత్తంగా వెట్టు కాగితం
తమిళసినిమా: అన్నా చెల్లెళ్ల కథాంశంతో ఇంతకుముందు చాలా చిత్రాలు వచ్చాయి. అయితే వాటికి భిన్నంగా ఈ తరం అన్నాచెల్లెళ్ల కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం వెట్టు కాగితం. మగిళ్ ప్రొడక్షన్స్ పతాకంపై సి.పియులా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మగిళ్ కుళువినార్ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శన్ విజయ్ హీరోగా నటిస్తున్న ఇందులో చాందిని, అప్పుకుట్టి, ఇమాన్ అన్నాచ్చి, సత్యం టీవీ ముక్తర్, కూల్‌సురేశ్, శ్రీధర్, జీవా, దీప, మదిచ్చియం బాలా, హలో కందసామి, నమో నారాయణన్, సత్య ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ ఇది అన్నాచెల్లెళ్ల ఇతివృత్తంతో రూపొందిస్తున్న కథా చిత్రంగా ఉంటుందన్నారు. చెల్లెలి కోసమే జీవించే అన్నయ్య నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రం ఇదని చెప్పారు. యాక్షన్, సెంటిమెంట్ అంటూ జనరంజకంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. దర్శన్ విజయ్ నటించిన పోరాట దృశ్యాలు ప్రేక్షకులను అబ్బురపరుస్తాయన్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె, పళని, కేరళా ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. షూటింగ్ చివరి దశకు చేరుకుందని, అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి దిలీపన్ చాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు.