
టీచర్లు అర్థమయ్యేలా బోధించాలి
వేలూరు: ప్రాథమిక పాఠశాలలో టీచర్లు నాట్యం చేసి పాఠ్యాంశాలు బోధిస్తే విద్యార్థుల మనసులో స్థిరంగా నిలిచిపోతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్బిల్‌మహేష్ పొయ్యామొయి అన్నారు. వేలూరు జిల్లా పల్లిగొండలోని ప్రభుత్వ పాఠశాలలోని హెచ్‌ఎంలకు ప్రత్యేక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి ప్రసంగించారు. టీచర్లు విద్యార్థులకు అర్థమయ్యేలా విద్యా బోధన చేయాలన్నారు. టీచర్లు పాఠ్యాంశాలు బోధించే సమయంలో విద్యార్థులకు ఏ విధంగా బోధిస్తే అర్థమవుతుందనే విషయాలను తెలుసుకోవాలన్నారు. ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ఏమి కారణం అనే విషయాన్ని టీచర్లు తెలుసుకోవాలన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది విద్యార్థులు పాఠశాలలో ఎంత మంది చేరుతున్నారు, తగ్గితే ఎందుకు తగ్గుతున్నారు అనే విషయాలను తెలుసుకోవాలన్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నాట్యం చేస్తూ పాఠ్యాంశాలు బోధించినా, ఒక వస్తువును చూపించి బోధించినా విద్యార్థుల మనస్సులో ఉండిపోతుందన్నారు. ఒక మంచి సమాజాన్ని తయారు చేసే వారు టీచర్‌లు మాత్రమే అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. తాను పలు దేశాలకు, రాష్ట్రాలకు విద్యాశాఖ మంత్రిగా వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న వసతులుకన్నా మన రాష్ట్రంలో అన్ని వసతులున్నాయన్నారు. కలెక్టర్ సుబ్బలక్ష్మి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.