
క్లుప్తంగా
అదనపు కట్నం కేసులో
భర్త అరెస్ట్
అన్నానగర్: పెళ్లి సమయంలో 100 సవర్ల నగలు కట్నంగా ఇచ్చినా 200 సవర్ల నగలు కట్నం డిమాండ్ చేస్తూ వేధించినందుకు విద్యుత్ బోర్డు అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నెలోని నోలంబూర్‌కు చెందిన హరీష్ (31) విద్యుత్ బోర్డులో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గత ఫిబ్రవరిలో చూలైమేడు ప్రాంతానికి చెందిన డింపుల్ సంగీత (26)ను వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత ఇద్దరూ చూలైమేడు ప్రాంతంలోని ఓ ఇంట్లో విడివిడిగా నివసించారు. డింపుల్ సంగీత వివాహం సమయంలో ఆమె తల్లిదండ్రులు ఆమెకు 100 సవర్ల బంగారు నగలను కట్నంగా ఇచ్చారని తెలుస్తోంది. కాగా హరీష్, అతని తల్లి సంగీతను హింసించారని, కట్నంగా అదనంగా 200 సవర్ల బంగారు నగలు, 2 కిలోల వెండి నగలు తీసుకురావాలని డిమాండ్ చేశారని ఆరోపించారు. అదే సమయంలో ప్రశ్నించిన తనపై దాడి చేశారని అనే సంగీత ఫిర్యాదు ఆధారంగా, అన్నానగర్ ఆల్ ఉమెన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అదనపు కట్నం డిమాండ్ చేయడం నిజమేనని తేలడంతో పోలీసులు హరీష్‌ను శనివారం అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ సంతకాల ఉద్యమం
తిరుత్తణి: ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తోంది. బీజేపీ కనుసన్నల్లో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్నట్లు, ఓట్లు దొంగలించి ఎన్నికల్లో విజయం సాధిస్తున్నట్లు ఆరోపిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా తిరుత్తణి పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణన్ ఆధ్వర్యంలో శనివారం సంతకాల ఉద్యమం చేశారు. స్థానిక బైపాస్ రోడ్డులో ఓట్ల చోరీకి నిరసనగా ప్రజల నుంచి సంతకాల సేకరించి వాహనాలకు స్టిక్కర్లు అతికించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణన్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ను గుప్పిట్లో వుంచుకుని లక్షలాదిగా దొంగ ఓట్లు చేర్చి తద్వారా బీజేపీ ఎన్నిల్లో విజయం సాధిస్తున్నట్లు ఆరోపించారు. ఎన్నికల సంఘం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినట్లు, న్యాయబద్ధంగా ఎన్నికలు జరగాలంటే ఓటర్ల జాబితా పూర్తిగా తనిఖీ చేసి దొంగ ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రచారం చేసి ప్రజల నుంచి సంతకాలు తీసుకున్నారు. నేతలు రాశి రాజేంద్రన్, జాకీర్‌హుస్సేన్ పాల్గొన్నారు.
అన్నాడీఎంకే కూటమిలోకి మరిన్ని పార్టీలు వస్తాయి
కొరుక్కుపేట: మరికొన్ని పార్టీలు త్వరలో అన్నాడీఎంకే కూటమిలో చేరే అవకాశం ఉందని తమిళ మానిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జీకే వాసన్ అన్నారు. పుదుకోట్టైలో శనివారం వాసన్‌లో విలేకర్లతో మాట్లాడారు. వాస్తవం ఏమిటంటే కేంద్రంలోని జాతీయ ప్రజా స్వామ్య కూటమి, తమిళనాడులో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి వచ్చే ఏడాది ఎన్నికలకు ముందువరసలో ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పార్టీలు ఈ కూటమిలో చేరే అవకాశం ఉందన్నారు. తమ పార్టీ విషయానికి వస్తే ఈ కూటమి గెలుపునకు మంచి వాతావరణం సృష్టిస్తోందని అన్నారు. తాను తమిళనాడు అంతటా పర్యటించి విజయానికి కృషిచేస్తానని అన్నారు. అన్నాడీఎంకే, బీజేపీ, టీఎంసీ పార్టీలు భావసారూప్యత కలిగిన కూటమి పార్టీలు అని అభిప్రాయపడ్డారు.
డ్రగ్స్ విక్రయం కేసులో ముగ్గురి అరెస్ట్
తిరువొత్తియూరు: పోరూర్ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ కళాశాల విద్యార్థి సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 13 గ్రాముల మెథాబెటమైన్, 150 గ్రాముల గంజాయి, 2 సెల్‌ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మధురవాయల్ సమీపంలోని పోరూర్ ప్రాంతంలో మెథాబెటమైన్ డ్రగ్స్ విక్రయిస్తున్నారని వానగరం పోలీసులకు రహస్య సమాచారం అందింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి పోరూర్ టోల్ ప్లాజా సమీపంలోని సర్వీస్ రోడ్డులో పోలీసులు నిఘా పెట్టారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా ఒకే బైక్‌పై వచ్చిన ముగ్గురిని అడ్డుకుని పోలీసులు విచారించారు. వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, అందులో మెథాబెటమైన్ ఉన్నట్లు తెలిసింది. దీంతో ముగ్గురినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా, వారు పోరూర్ సమీపంలోని అయ్యప్పన్‌తాంగల్‌కు చెందిన శరణ్‌రాజ్ (36), పోరూర్ కు చెందిన రక్షిత్ రెగ్జిన్ మోన్ (23), నూంబల్ ప్రాంతానికి చెందిన జమునా కుమార్ (27) అని తెలిసింది. శరణ్‌రాజ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, రక్షిత్ రెగ్జిన్ మోన్ ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నాడని తెలిసింది. వీరు ఇతర రాష్ట్రాల నుంచి మెథాబెటమైన్ డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేసి కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి డ్రగ్స్ విక్రయంలో ఇంకెవరికై నా సంబంధం ఉందా? అనే కోణంలో వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. విచారణ అనంతరం శనివారం ముగ్గురిని పూందమల్లి కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలులో పెట్టారు.