
చైన్నె వన్ యాప్ సిద్ధం
సాక్షి, చైన్నె : చైన్నె నగరంలోని అన్ని రవాణా సేవలను ఒకే గూటికి తీసుకొచ్చే విధంగా చైన్నె వన్ యాప్ సిద్ధమైంది. దీనిని సోమవారం స్టాలిన్ ఆవిష్కరించనున్నారు. చైన్నె నగరం విస్తరణ దిశగా మూడో మాస్టర్ ప్లాన్ అమలుకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అదే సమయంలో రవాణా సేవలను ఒకే గూటికి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఎంటీసీ, మెట్రో, ఎలక్ట్రిక్, ఎంఆర్‌టీఎస్ రైలు సేవలతో పాటూ క్యాబ్ సేవలను ఒకే వేదికపై తెచ్చేవిధంగా, ఇందుకు సంబంధించిన టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలుగా చైన్నె వన్ యాప్ సిద్ధం చేశారు. యూపీఐ ద్వారా చెల్లింపులతో సులభతరంగా రవాణా సేవలు పొందేందుకు వీలుగా రూపకల్పన చేసిన ఈ యాప్‌ను సీఎం స్టాలిన్ సచివాలయంలో ఆవిష్కరించనున్నారు.
జీఎస్టీ ప్రయోజనాలపై ప్రచారం
సాక్షి, చైన్నె: జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలపై ప్రజలకు, దుకాణదారులకు అవగాహనక ల్పించే విధంగా విరుదునగర్‌లో ఆదివారం ప్రచార కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహం తరహా ఫ్లెక్సీకి పుష్పాంజలి ఘటించినానంతరం ఈ అవగాహన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కో ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి,నేతలు వెట్రివేల్ తదితరులు విరుదునగర్‌లోవీధులలో తిరుగుతూ అన్ని దుకాణాలకు వెళ్లి జీఎస్టీ తగ్గింపునకు సంబంధించిన సమాచారాలను, అంశాలను వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన వివిధ వస్తువులకు జీఎస్టీ తగ్గింపునకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. సోమవారం నుంచి ఈ తగ్గింపు అమల్లోకి రానున్న దృష్ట్యా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల నేతల నేతృత్వంలో అవగాహన ప్రచార కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు.
30 సీట్లే లక్ష్యం
సాక్షి, చైన్నె : పీఎంకేకు 30 సీట్లు కేటాయించే వారితో పొత్తు దిశగా ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఆదివారం నిర్ణయించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసేందుకు ప్రయత్నాలు చేపట్టనున్నారు. వివరాలు.. పీఎంకేలో అన్బుమణి, రాందాసు మధ్యసమరం గురించి తెలిసిందే. ఎన్నికల కమిషన్‌కు అన్బుమణి వర్గం తప్పుడు సమాచారాలు ఇచ్చినట్టుగా రాందాసు వర్గంఫిర్యాదుచేసింది. పార్టీ తమదేనంటూ అన్బుమణి వర్గం వ్యాఖ్యలు చేస్తుంటే, వారి వ్యూహాలకు చెక్ పెట్టే ప్రయత్నాలపై రాందాసు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆదివారం పార్టీ ఎ మ్మెల్యేలు, ముఖ్య నిర్వాహకులతో తైలాపురంలో సమావేశమయ్యారు. పార్టీ నేతలు జికేమణి, అరుల్, రాందాసుకుమార్తె శ్రీగాంధి ,నేతలు అన్బుళగన్, పరందామన్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశం పొత్తుల కసరత్తుల గురించిచర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.కూటమి ఎవరితో అన్నది తుది నిర్ణయంగా తీసుకునే అధికారం రాందాసుకు అప్పగించారు. 30 సీట్లు ఇచ్చే వారితోనే పొత్తు అన్న సంకేతాన్ని ఇస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు రాందాసు వర్గం పేర్కొంటోంది. అలాగే, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు ప్రయత్నాలు చేపట్టబోతున్నట్టు, రెండు మూడు రోజులలో ఈ భేటీ జరిగే అవకాశాలు ఉన్నట్టు ఓ నేత పేర్కొన్నారు.
ఇంజిన్ సమస్యతో జోలార్‌పేటలో నిలిచిన వందే భారత్
– ప్రయాణికుల అవస్థలు
వేలూరు: కర్ణాటక రాష్ట్రం మైసూరు రైల్యే స్టేషన్ నుంచి చైన్నె వెళ్లేందుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం మధ్యాహ్నం 1.05 గంటలకు ప్రయాణికులతో బయలుదేరింది. ఈ రైలు బెంగుళూరు, కట్పాడి రైల్యే స్టేషన్‌లో మాత్రమే నిలిచి రాత్రి 7.20 గంటలకు చైన్నె సెంట్రల్ రైల్యే స్టేషన్ చేరాల్సి ఉంది. ఈ రైలు తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట రైల్వే స్టేషన్ సమీపంలోని పచ్చూరు వద్దకు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వచ్చింది. ఆ సమయంలో రైలు ఇంజన్ సమస్య ఏర్పడడంతో రైలు మద్యలోనే నిలిచి పోయింది. వెంటనే రైలు ఇంజిన్‌లో ఉన్న రైల్యే సిబ్బంది వెంటనే మరమ్మతు పనులు చేపట్టి సుమారు గంట పాటూ శ్రమించి సరిచేశారు. అనంతరం సాయంత్రం 6 గంటల సమయంలో రైలు బయలుదేరి వెళ్లింది. కొద్ది కిలో మీటరు దూరం వెళ్లిన రైలు మరోసారి ఇంజన్ సమస్య రావడంతో నిలిచి పోయింది. వెంటనే రైల్వే అధికారులు బెంగుళూరులోని రైల్యే అధికారులకు సమాచారం అందజేయడంతో అక్కడ నుంచి వందే భారత్ రైలు ఇంజిన్‌ను రప్పించి రాత్రి 8.15 గంటలకు రైలు బయలుదేరి వెల్లింది. రైలు ఇంజన్ సమస్యతో సుమారు మూడు గంటల పాటూ రైలులోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి సమయం కావడంతో రైలు పట్టాలపై మధ్యలో రైలు నిలిచిపోవడంతో ఎందుకు నిలిచింది. ఎప్పుడు రైలు బయలు దేరుతుందనే విషయాలు తెలియక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

చైన్నె వన్ యాప్ సిద్ధం