
నాలుగేళ్లలో రూ.22 వేల కోట్ల స్కాం
సాక్షి, చైన్నె : డీఎంకే అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాల కాలంలో టాస్మాక్ మద్యం దుకాణాల ద్వారా రూ. 22 వేల కోట్ల మేరకు స్కాం జరిగినట్టు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ఆరోపించారు. ప్రజా చైతన్యయాత్రలో భాగంగా మంగళవారం పళణిస్వామి నీలగిరిలో పర్యటించారు.కున్నూరులో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ, డీఎంకే ప్రభుత్వం అంతా అవినీతిమయం అని ఆరోపించారు. టాస్మాక్ మద్యం దుకాణాల ద్వారా ఈనాలుగు సంవత్సరాలలో రూ.22 వేల కోట్ల మేరకు స్కాం జరిగిందని వివరించారు. దీని వెనుక ఉన్న వాళ్లను వదిలి పెట్టేప్రసక్తే లేదన్నారు. అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే ఈ స్కాంలో ఉన్న వాళ్లను కోర్టు బోనులోకి ఎక్కిస్తామన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్నారని, మాయా జాలంలో ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్టుగా నాటకాలు రచిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక అన్నాడీఎంకేను విచ్ఛిన్నం చేయడానికి డీఎంకే పెద్ద కుట్ర చేస్తున్నట్టు ఆరోపించారు. తమ పార్టీలో చిచ్చు రగిల్చి, దానిని తనకు అనుకూలంగా మలచుకునే వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారని వివరించారు. వారి పాచికలను పారనివ్వనని, వారి చర్యలను అడ్డుకుంటానని, డీఎంకే పతనం లక్ష్యంగా ప్రజలంతా తన వెన్నంటి నిలవాలని పిలుపునిచ్చారు.