
ఓం కాళి... జై కాళి
కుల శేఖర పట్నంలో దసరా సంబరాలకు ఓం కాళి...జై కాళి అన్న నామ స్మరణతో మంగళవారం శ్రీకారం చుట్టారు. సంప్రదాయ పూజలతో ఉత్సవాలకు ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు. తొలి రోజున భక్తులు పెద్దఎత్తున తరలి రావడంతో కుల శేఖర పట్నం భక్తి పారవశ్యంలో మునిగింది.
సాక్షి, చైన్నె: కర్ణాటక రాష్ట్రం మైసూర్ తదుపరి దసరా ఉత్సవాలకు ప్రసిద్ది చెందిన ప్రదేశం కులశేఖర పట్నం. తూత్తుకుడి జిల్లాలోని ఈ కులశేఖర పట్నంలో జ్ఞాన ముత్తీశ్వరర్ సమేత ముత్తారమ్మన్ దేవి ఆలయం ఉంది. తమిళనాడులో దసరా వేడుకలు అత్యంత వైభంగా జరిగే ఆలయం ఇదొక్కటే. కాళీ మాత వేషాధారణలో భక్తులు ఇక్కడకు తరలి వచ్చి పూజలు చేయడం ఆనవాయితీ. ఇక్కడ కేవలం దసరా ఉత్సవాలు మాత్రమే అత్యంత వేడుకగా జరుగుతాయి. ప్రపంచ దేశాల నుంచి ఇక్కడకు భక్తులు ఈ ఉత్సవాల నిమ్తితం పొటెత్తడం జరుగుతుంది.
ధ్వజారోహణంతో..
ముత్తారమ్మన్ దేవి సన్నిధిలో మంగళవారం వేకువ జాము నుంచి ప్రత్యేక పూజలు , అభిషేకాలు జరిగాయి. వ్రతం ఆచరించే విధంగా భక్తులు కంకణాన్ని ఆలయంలో కట్టుకున్నారు. కాళీ మాత మాలలను ధరించారు. ఆలయం ఆవరణలోని ధ్వజస్థంభానికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. గజరాజుపై ధ్వజస్తంభ పతాకాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఽసంప్రదాయ బద్ధంగా పూజలతో దసరా సంబరాలకు ఉదయం ఆరు గంటలకు ధ్వజారోహణం జరిగింది. తొలి రోజు వేలాది మంది భక్తులు ఉత్సవాలకు పోటెత్తారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో రాత్రి వేళ అమ్మ వారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులు కాళి, శివుడు, సుబ్రమణ్య స్వామి, హనుమంతుడి వేషాలలో తరలి రావస్తున్నారు. ఈ ఉత్సవాల నిమిత్తం భక్తులు ఊరూరా తిరిగి విరాళాల్ని సేకరించి ఆలయంలో కానుకగా సమర్పించడం జరుగుతోంది.
సూర సంహారం...
ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టం సూర సంహార అక్టోబరు 2 వ తేదీ అర్థరాత్రి నుంచి కనుల పండువగా జరగనుంది. ఆ రోజు రాత్రి 12 గంటలకు అమ్మవారి ప్రత్యేక అభిషేకాది పూజలు జరుగుతాయి. అమ్మవారు సింహ వాహనంపై సముద్ర తీరం వైపుగాా సూర సంహారానికి వెళ్తారు. ఈ సమయంలో కాళికా దేవి వేషాదారణలో భక్తులు అమ్మవారిని వెంబడిస్తూ పరుగులు తీయడం జరుగుతుంది. రాత్రంతా సూర సంహార ఘట్టం అద్వితీయంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు లక్షల్లో భక్తులు పోటెత్తుతారు. ఈ ఉత్సవాల దృష్ట్యా, తరలి వచ్చే భక్తులకఎలాంటి ఇబ్బందులు కల్గకుండా తూత్తుకుడి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. కుల శేఖర పట్నం పరిసరాలను, మార్గాలను పోలీసులు నిఘా వలయంలోకి తీసుకొచ్చారు.

ఓం కాళి... జై కాళి