
రంగంలోకి జస్టిస్ అరుణా జగదీశన్
సాక్షి, చైన్నె: కరూర్ తొక్కిసలాట ఘటనపై జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని ఏక సభ్యకమిషన్ విచారణకు శ్రీకారం చుట్టింది. ఆదివారం సాయంత్రం నుంచి ఆమె రంగంలోకి దిగారు. ఘటన జరిగిన వేలు స్వామి పురం పరిసరాలను పరిశీలించారు. ఇక్కడ విజయ్ సభ జరిగిన ప్రదేశం నుంచి 500 నుంచి 700 మీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న ఇరుకై న రోడ్డు వద్దే తొక్కిసలాట మొదలైనట్లు పలువురు ఆమె దృష్టికి తీసుకెళ్లినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ ప్రాంతంలో ఓ చెట్టు మీద అభిమానులు చేరడం, అలాగే, చెట్టు పక్కనే ఇనుపరేకులతో కూడిన షెడ్డులపై చేరడం, అవి కుప్పకూలడం వంటి ఘటనలు జరిగినట్టు వివరించారు. ఈ తొక్కిసలాట సమయంలో జనం భయంతో ఎటు వెళ్లాలో తెలియక సమీపంలో ఉన్న కాలువలో పడి మరణించిన వారు, ఊపిరి ఆడక మరణించిన వారు ఎక్కువగా ఉన్నట్టు, అందుకే ఆస్పత్రికి మరణించిన వారే అధికంగా వచ్చినట్టు విచారణలో వెలుగు చూసింది. విజయ్ రాక ముందేగా స్వల్ప తొక్కిసలాట జరిగినా, ఆ విషయం ఆయన దృష్టికి రాలేదని, పరిస్థితి పరిగణించి పదినిమిషాలలో ప్రసంగాన్ని ముగించి ఆయన వెళ్లినానంతరం మరింత దారుణం చోటు చేసుకున్నట్టుగా అక్కడి వారు ఈ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం.
అంబులెన్స్‌ల రాకతో..
విజయ్ వెళ్లినానంతరం జనం ఎలా బయటకు వెళ్లాలో తెలియక, అదే సమయంలో వరసగా అంబులెన్స్‌లు రావడంతో వారికి దారి ఇవ్వాల్సిన పరిస్థితులలో మరింతగా తోపులాట చోటు చేసుకోవడంతో ఊపిరి ఆడక మరణించిన వారెందరో ఉన్నట్టు పేర్కొనడం గమనార్హం. అంబులెన్స్‌లకు దారి ఇవ్వడం కోసం ఓ చోట లాఠీ చార్జ్‌ను పోలీసు చేశారని, టీవీకే వర్గాలు ఈ సమయంలో తిరగబడ్డట్టుగా కొందరు పేర్కొనడం గమనించ దగ్గ విషయం. ఇక, అదనపు డీజీపీ డేవిడ్సన్ దేవాశీర్వాదం తాము కల్పించిన భద్రత చర్యలను ఆమెకు వివరించారు. 2 గంటలకు రావాల్సిన నాలుగు నుంచి ఐదు గంటలు ఆలస్యంగా రావడంతో జనం నీరసించిపోయారని పేర్కొనడం గమనించ దగ్గ విషయం. ఐజీ, డీఎస్పీ, ఎస్పీ, ఏఎస్పీ వంటి 58 మంది ఉన్నతాధికారులతో పాటుగా 500 మంది ఇక్కడ భద్రతా విధులలో ఉన్నట్టు వివరించారు. తొలుత విజయ్ పార్టీ వర్గాలు లైట్ హౌస్ జంక్షన్, రైతు బజార్ వద్ద స్థలాన్ని అడిగినట్టు, ఆ స్థలాలు మరింత ఇరుకుగా ఉండటం, భద్రతా పరంగా సమస్యలు ఉంటాయనే వేలు స్వామి పురంకు కేటాయించినట్టు వివరించారు. అనంతరం ఆమె ఆస్పత్రికి చేరుకుని చికిత్సలో ఉన్న బాధితులను పరామర్శించారు.
వారి వద్ద సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. అనంతరం అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడే ఉండి ఆమె విచారణ సాగించనున్నారు. ఇదిలా ఉండగా, కరూర్ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ పలువురు బాధిత కుటుంబాలు మీడియా ముందుకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశాయి. నటులు రాజకీయాలలోకి రాకూడదా? అడ్డుకుంటారా? అని ప్రశ్నించి వాళ్లు ఎక్కువే. భద్రతా వైఫల్యం ఈ ఘటనలో ఉందని, టీవీకే వర్గాలపై కొన్ని చోట్ల పోలీసులు విరుచుకు పడినట్టుగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో మరి కొందరు అయితే, ఇక్కడికి సమీపంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్ద అకస్మాత్తుగా నిప్పు రవ్వలు రావడం, తక్షణం పరిసరాలన్నీ అంధకారంలో మునగడం కూడా తొక్కిసలాటకు కారణంగా పేర్కొంటున్నారు.