అపోలో హాస్పిటల్స్ మరో మైలురాయి
కొరుక్కుపేట: చైన్నెలోని గ్రీమ్స్ లేన్‌లోని అపోలో హాస్పిటల్స్, తమిళనాడులో మొట్టమొదటి లీడ్‌లెస్ డ్యూయల్ చాంబర్ ఏవీఈఐఆర్ ఫేస్‌మేకర్‌ను విజయవంతంగా అమర్చడంతో అధునాతన గుండె సంరక్షణలో మరో గొప్ప మైలురాయిని సాధించింది. ఈ సంక్లిష్టమైన ప్రక్రియను సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ కార్తికేసన్, అతని గుండె నిపుణుల బృందం నిర్వహించారు. ఈ చికిత్స పొందిన వ్యక్తి 80 ఏళ్ల పురుష రోగి, అతనికి అధిక రక్తపోటు, మధుమేహం, గతంలో యాంజియోప్లాస్టీ చేయించుకున్న వ్యక్తి. డయాలసిస్ పై దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి తోనూ బాధపడుతున్నారు. వయసు సంబంధిత పూర్తి హార్ట్ బ్లాక్ కారణంగా అతనికి నెమ్మదిగా హృదయ స్పందన రేటు, పదేపదే స్పృహ కోల్పోవడం వంటివి ఉన్నాయి. సాంప్రదాయ ఫేస్‌మేకర్లతో అతనికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున, అటువంటి రోగులకు సురక్షితమైన , మరింత అధునాతనమైన ప్రత్యామ్నాయంగా వినూత్నమైన లెడ్‌లెస్ పేస్‌మేకర్ వ్యవస్థను బృందం ఎంచుకుంది. ఏవీఈఐఆర్ డ్యూయల్ చాంబర్ పేస్‌మేకర్ తదుపరి తరం కార్డియాక్ పేసింగ్ టెక్నాలజీని ఉపయోగించి చేపట్టినట్టు వైద్యుల బృందం వెల్లడించింది.


