యూట్యూబ్ విపరీతాల చిత్రం
తమిళసినిమా: నానాటికి అభివృద్ది చెందుతున్న టెక్నాలజీ కారణంగా మంచితోపాటు చెడు జరుగుతోంది. ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్లను నిర్వహించేవారు చేతిలో స్మార్ట్ ఫోన్లు పట్టుకుని అధిక లైక్స్ పొందాలన్న దురాశతో హద్దులు మీరుతున్నారు. అలా విపరీత చర్యల కారణంగా ఎందరో అమాయకులు బలైపోతున్నారు. కొందరు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు పాల్పడుతున్న అక్రమాలను తెరపై ఆవిష్కరించిన చిత్రం ఇరవిల్ విళిగల్. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని మహేంద్ర ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మహేంద్రన్ నిర్మించారు. సిక్కల్ రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేంద్రన్ కథానాయకుడిగా నటించారు. ప్రతినాయకుడి పాత్రలో సిక్కల్ రాజేశ్ నటించిన ఇందులో నటి రీమారే నాయకిగా నటించగా నటుడు నిలళ్‌గల్ రవి, మస్కారా అశ్మిత, కుందాజ్, చరణ్‌రాజ్, సిజర్ మనోహర్, ఈశ్వర్ చంద్రబాబు, కిళి రాజేంద్రన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఏఎం.ఆసార్ సంగీతాన్ని, భాస్కర్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. దీన్ని యాక్షన్ రియాక్షన్ సంస్థ తమిళనాడులో విడుదల చేసింది. సిటీలోనే కాకుండా, దట్టమైన అడవీ ప్రాంత్లాలో అధికంగా చిత్రీకరణను జరుపుకున్న ఈ చిత్రంలో అనూహ్యంగా హత్యలు జరుగుతుంటాయి. వాటిని ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారనే మిస్టరినీ కనిపెట్టడానికి పోలీసులు రంగంలోకి దిగుతారు. వారి విచారణలో పలు ఆశ్చర్యకరమైన సంఘటనలు వెలుగు చూస్తాయి. అలా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథా, కథనాలతో సాగే ఇరవిల్ విళిగల్ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇరవిల్ విళిగల్ చిత్రంలో నటీనటులు
యూట్యూబ్ విపరీతాల చిత్రం


