సాక్షి, చైన్నె: ఎన్నికల విధులలో భాగంగా 4 లక్షల మందికి సిబ్బందికి శిక్షణను విస్తృతం చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ ప్రకటించా రు. ఓటింగ్‌కు ఐదు రోజులకు ముందే ఓటర్లకు బూత్ స్లిప్పుల పంపిణి పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకు రూ. 42 కోట్లు సీజ్ చేశామని ప్రకటించారు. వివరాలు.. తమిళనాడు శాసనసభ సాధారణ ఎన్నికలు 2026 ఏర్పాట్లలో భాగంగా ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ నేతృత్వంలో సమీక్షలు విస్తృతమయ్యాయి. అలాగే నిఘాను ముమ్మరం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌ల తనిఖీలు వేగం పుంజుకున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా భారీగా నగదు , ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. తిరువణ్ణామలై జిల్లా కీల్‌పెన్నాత్తూరు సమీపంలో యాభైకు పైగా పంచలోహ విగ్రహాలు అధికారుల తనిఖీలలో బయట పడ్డాయి.
సమగ్ర శిక్షణ..
ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సుమారు 4 లక్షల మంది ఎన్నికల సిబ్బందికి సమగ్ర శిక్షణ కార్యక్రమాలను విస్తృతం చేశామన్నారు.ఇందులో 6,803 మంది సెక్టార్ అధికారులు, 75,035 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2,25,105 మంది పోలింగ్ అధికారులు ఉన్నారని వివరించారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు శిక్షణ పూర్తి చేయగా, ప్రస్తుతం జిల్లా, క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ కొనసాగుతోందన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణ, టెక్నాలజీ వినియోగంపై సిబ్బందికి ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక అబ్జర్వర్లు రంగంలోకి దిగనున్నట్టు పేర్కొన్నారు. ఇక, పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేయడానికి వచ్చే ఓటర్లు తమ గుర్తింపును ధృవీకరించుకునేదుకు పాటించాల్సిన నిబంధనలను ఎన్నికల ప్రధాన అధికారి విడుదల చేశారు.ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఓటరు ఫోటో గుర్తింపు కార్డు ను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. ఓటరు కార్డు లేకపోతే ఆధార్ కార్డు, జాబ్ కార్డ్, బ్యాంకు, పోస్టాఫీసు జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్ , ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు తదితర వాటిలో ఏదైనా ఒకటి చూపించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.
రూ. 42.65 కోట్లు సీజ్..
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో మొత్తం రూ.42.65 కోట్ల విలువైన నగదు, వస్తువులను సీజ్ చేసినట్లు అర్చనా పట్నాయక్ ప్రకటించారు. ఇందులో రూ. 2.37 కోట్లు నగదు, రూ. 2.88 కోట్లు విలువైన మాధక ద్రవ్యాలు, రూ. 16.42 కోట్లు విలువైన బంగారు, వెండి వస్తువులు, రూ.20.80 కోట్లు విలువైన ఇతర వస్తువులు ఉన్నట్టు వివరించారు.ఓటర్లను ప్రలోభపెట్టే నగదు, కానుకల పంపిణీని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు నిరంతరం నిఘాతో వ్యవహరిస్తున్నాయని తెలిపారు.


