మరో 250 కంపెనీల
పారా మిలటరీ రాక
ఈసీ అర్చనా పట్నాయక్ పర్యవేక్షణ
రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను పరిశీలిస్తున్న అర్చనా పట్నాయక్ తదితరులు
సాక్షి, చైన్నె: జిల్లా ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎం, వీవీ ప్యాట్,కంట్రోల్ పానల్‌ను నియోజకవర్గాల వారీగా శుక్రవారం నుంచి కేటాయించనున్నామని తెలిపారు. శుక్రవారం ధర్మపురి, అరియలూర్, మార్చి 23న చైన్నె, తిరువళ్లూర్, కాంచీపురం, వేలూరు, కృష్ణగిరి, తిరువణ్ణామలై, విల్లుపురం, నమక్కల్, ఈరోడ్, నీలగిరి, కోయంబత్తూరు, దిండిగల్, కరూర్, తిరుచ్చి, పెరంబలూరు, కడలూరు, నాగపట్నం, తిరువారూర్, తంజావూరు, శివగంగ, మదురై, రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి, కన్యాకుమారి, తిరుప్పూర్, కళ్లకురిచ్చి, తెన్కాసి, చెంగల్పట్టు, తిరుపత్తూరు, రాణిపేట, మైలాడుతురై జిల్లాలకు కేటాయించనున్నారు. మార్చి 24న సేలం,పుదుకోట్టై, విరుదునగర్, 25న తేని జిల్లాలలోని నియోజకవర్గాలకు పంపిణీ చేయనున్నారు.ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత, యంత్రాల జాబితాను రాజకీయ పార్టీలకు అందజేసి, వాటిని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లలో భద్ర పరచడం జరుగుతుందని అర్చనా పట్నాయక్ వివరించారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తమిళనాడుకు భారీగా భద్రతా బలగాలను కేటాయించిందని తెలిపారు. ఇప్పటికే 50 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (పారా మిలటరీ) రాష్ట్రానికి చేరుకున్నాట్టు , అదనంగా మరో 250 కంపెనీల బలగాలను కేంద్రం కేటాయించిందన్నారు. ఈ బృందాలు ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 13వ తేదీల్లో రెండు విడతలుగా రాష్ట్రానికి చేరుకోనున్నాయన్నారు.
కొత్త టెక్నాలజీ
ఎన్నికల రోజున ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ సరళిని అప్‌డేట్ చేయడం కోసం ప్రిసైడింగ్ అధికారుల కోసం ప్రత్యేకంగా పీఆర్‌ఓ యాప్‌ను రూపొందించామన్నారు. దీనిపై జిల్లా అధికారులకు ప్రత్యేక శిక్షన అందిస్తున్నామన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం, పోలింగ్ రోజు (ఏప్రిల్ 23), ఒకరోజు ముందు (ఏప్రిల్ 22) ప్రింట్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు ప్రచురించకూడదన్న నిబంధనను విధిస్తున్నామని ప్రకటించారు. ఒకవేళ ప్రచురించాల్సి వస్తే, సంబంధిత ఎంసిఎంసి (కమిటీ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి అని చెప్పారు.
వృద్ధులు, దివ్యాంగుల కోసం ఇంటి వద్దకే..
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ,ఓటర్లకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర సేవల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. 85 ఏళ్లు పైబడిన వృద్ద ఓట ర్లు, దివ్యాంగులుగా, అత్యవసర సేవల సిబ్బందిగా ఉన్న అగ్నిమాపక దళం, ఆరోగ్యం, విద్యుత్, ట్రాఫి క్, అంబులెన్స్, విమానయానం, ప్రభుత్వ రవాణా సంస్థల్లో పనిచేసే సిబ్బందికి తపాల్ ఓట్లకు అవకా శం కల్పిస్తూ చర్యలు తీసుకున్నామన్నారు. 85 ఏళ్లు పైబడ్డ వారు, దివ్యాంగుల కోసం ఇంటి వద్దకే తపాల్ ఓట్లు వేసేందుకు ‘ఫామ్ 12డి’ పూర్తిచేసి, నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లోపు బీఎల్‌ఓ ద్వారా రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని సూచించారు. రిటర్నింగ్ అధికారులు ఒక షెడ్యూల్ ప్రకారం పోలింగ్ బృందాలను ఓటర్ల ఇళ్లకు పంపి, రహస్య పద్ధతిలో ఓట్లను సేకరిస్తారని, దీనిపై ముందే అభ్యర్థులకు సమాచారం ఇస్తామన్నారు. వీరికి ఎలక్ట్రానిక్ పద్ధతిలో పోస్టల్ బ్యాలెట్లను పంపిస్తారని, వీరు పోస్టల్ ఖర్చులు భరించాల్సిన అవసరం లేదన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేసిన ఓట్లన్నీ ఓట్ల లెక్కింపు రోజైన మే 4వ తేదీ ఉదయం 8 గంటలలోపు సంబంధిత రిటర్నింగ్ అధికారులకు చేరాల్సి ఉంటుందన్నా రు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది కోసం ప్రత్యేక ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని, అక్కడ ఓటింగ్ రహస్యాన్ని కాపాడుతూ ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించామన్నారు. కాగా, చైన్నె వంటి నగరాలలో బహుళ అంతస్తుల గృహ సముదాయాలు ఉండే ప్రాంతాలు, లగ్జరీ విల్లాలు ఉండే ప్రాంతాలలో ఓటు అవగాహన కార్యక్రమాలకు చర్యలు చేపట్టనున్నామని, ప్రతి ఒక్కరూ తమ హక్కను వినియోగించేందుకు అవకాశం కల్పించనున్నామన్నారు. ఇదిలా ఉండగా, తమిళనాట ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లు చైన్నెలో జరిగే తేదీలను మార్చాలని కోరుతూ కొందరు అభిమానులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం గమనార్హం.
నేటి నుంచి జిల్లాల వారీగా కేటాయింపు


