సాక్షి, చైన్నె: వైద్య రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో భాగమైన గ్లెనీగల్స్ హాస్పిటల్స్ చైన్నె అరుదైన మైలురాయిని అధిగమించింది. కేవలం 28 నెలల స్వల్ప వ్యవధిలోనే 500 రోబోటిక్ సహాయక గైనకాలజీ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసింది. దేశంలోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆసుపత్రులలో ఒకటిగా నిలిచింది.
రికార్డు స్థాయిలో చికిత్సలు
ఈ విజయ ప్రస్థానంలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఒక రోగికి 5 కిలోల బరువున్న ఫైబ్రాయిడ్‌ను రోబోటిక్ హిస్టరెక్టమీ ద్వారా తొలగించి రికార్డు సృష్టించారు. సంక్లిష్టమైన కేసులను కూడా అత్యంత కచ్చితత్వంతో నిర్వహించవచ్చని వైద్యుల బృందం చాటింది. ఈ మైలురాయిని అధిగమించడంలో ప్రసూతి గైనకాలజీ విభాగం డైరెక్టర్, ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ పద్మప్రియ వివేక్ కీలక పాత్ర పోషించారు. ఆమె నేతృత్వంలో హిస్టరెక్టమీలు, మయోమెక్టమీలు, ఎండోమెట్రియోసిస్ తొలగింపు, గైనకాలజికల్ క్యాన్సర్ సర్జరీలు విజయవంతంగా జరిగాయి. సాధారణ శస్త్రచికిత్సలతో పోలిస్తే రోబోటిక్ సర్జరీ ద్వారా మహిళలకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని వైద్యులు వివరించారు. గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ సందర్భంగా డాక్టర్ పద్మప్రియ వివేక్ మాట్లాడుతూ, రోబోటిక్ టెక్నాలజీ వల్ల క్లినికల్ ఫలితాలు మెరుగుపడటమే కాకుండా, రోగి భద్రత కూడా పెరుగుతుందని తెలిపారు. ఆసుపత్రి సీఓఓ ఎస్. నిరంజని, ఫోర్టిస్ హెల్త్‌కేర్ సీఓఓ అనిల్ వినాయక్ మాట్లాడుతూ అత్యాధునిక చికిత్సలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.


