తాను రాజకీయాల్లో ఫైర్ బ్రాండే కాదు.. ఆపదలో ఆదుకొనే అమ్మ మనస్సున్న మంచి మహిళని మరోసారి మాజీ మంత్రి ఆర్కే రోజా నిరూపించారు. ఊపిరితిత్తులు 90 శాతం పాడై ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న గౌతమ్(8) అనే బాలుడిని మెరుగైన వైద్యసేవల కోసం తిరుపతి నారాయణాద్రి ఆస్పత్రికి తరలించారు. సొంత ఖర్చులతో రెండు శస్త్ర చికిత్సలు చేయించి గౌతమ్ ప్రాణం నిలబెట్టారు. నిరుపేదలైన ఆ బాలుడి తల్లిదండ్రులు నీ రుణం ఎలా తీర్చుకోగలమమ్మా అంటూ చెమ్మగిల్లిన కళ్లతో రోజాకు మనసారా కృతజ్ఙతలు తెలిపారు.
పుత్తూరు: మండల పరిధిలోని మజ్జిగ గుంట కాలనీకి చెందిన శివ కుమారుడు గౌతమ్(8) కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల పరిస్థితి విషమించడంలో తల్లిదండ్రులు తిరుపతి రుయా ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడిని పరిశీలించిన వైద్యులు ఊపిరితిత్తులు 90 శాతం పాడయ్యాయని, ఖర్చుతో కూడుకొన్న ఆపరేషన్ అవసరమవుతుందని తేల్చి చెప్పారు. దీంతో దిక్కుతోచని ఆ తల్లిదండ్రులు సాయం చేసే వారి కోసం అన్వేషించారు. ఆశాదీపంగా మాజీ మంత్రి ఆర్కే రోజా వారి మదిలో మెదిలారు. ఆలస్యం చేయకుండా ఆమె వద్దకు వెళ్లి కుమారుడి పరిస్థితిని వివరించారు. వెంటనే స్పందించిన మాజీ మంత్రి ఆర్కే రోజా రుయా ఆస్పత్రికి వెళ్లి బాలుడ్ని మెరుగైన వైద్య శస్త్ర చికిత్సల కోసం నారాయణాద్రి ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులకు సూచించారు. దీంతో వైద్యులు గౌతమ్‌కు రెండు పర్యాయాల పాటు శస్త్ర చికిత్సలు చేసి, ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించారు. ప్రసుత్తం గౌతమ్ వైద్యుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉన్నాడు. శుక్రవారం మరోసారి ఆసుపత్రికి వెళ్లిన రోజా గౌతమ్‌ను, తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. డాక్టర్లు త్వరలో గౌతమ్‌ను డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు చెమ్మగిల్లిన కళ్లతో మాజీ మంత్రి ఆర్కే రోజాకు కృతజ్ఙతలు తెలిపారు.


