తిరుచెందూర్ హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు
అన్నానగర్: తిరుచెందూరులోని సుబ్ర హ్మణ్యస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలోని హుండీలోని కానుకలను అధికారుల సమక్షంలో ఆలయ సిబ్బంది లెక్కించారు. లెక్కింపులో రూ.4, 36, 87,797 నగదు, కిలో 143 గ్రాముల బంగారం, 20 కిలోల 474 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీని భక్తులు కానుకలను సమర్పించారు. నగదును ప్రభుత్వ ఖాతాలో జమచేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
అలరించిన
షెహనాయి కచేరి
కొరుక్కుపేట: పండిట్ డాక్టర్ ఎస్ బల్లేష్ భజంత్రి హిందూ స్థానీ శాసీ్త్రయ షెహనాయి కచేరి విద్యార్థులను అలరించింది. చైన్నెలోని ఎస్‌కేపీడీ ప్రాథమిక, మహోన్నత పాఠశాలలు, స్పిక్ మెకే సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ సంగీత కచేరిలో పండిట్ ఎస్. బల్లేష్ భజంత్రి తనదైన శైలిలో షెహనాయి సంగీతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈసందర్భంగా హెచ్‌ఎంలు ఓ.లీలా రాణి, ఈ.రమేష్, కరస్పాండెంట్ ఎస్‌ఎల్ సుదర్శనం, ఊటుకూరు శరత్‌కుమార్ పాల్గొని కళాకారులను ఘనంగా సత్కరించారు.
అలల్లో చిక్కుకుని
యువకుడి మృతి
అన్నానగర్: సేలం జిల్లాలోని పారైపట్టి ప్రాంతానికి చెందిన దయానందన్ (29) పని వెతుక్కుంటూ 16వ తేదీన సేలం నుంచి చైన్నెకి వచ్చాడు. గురువారం మధ్యాహ్నం, అతను మెరీనా బీచ్‌లోని దివ్యాంగుల నడకదారి సమీపంలో తన సెల్‌ఫోన్ సహా తన వస్తువులను ఒడ్డున వదిలి సముద్రంలో స్నానానికి వెళ్లాడు. అప్పుడు, అనుకోకుండా, అతను ఒక భారీ అలలో చిక్కుకుని లోతైన ప్రాంతంలోకి కొట్టుకుపోయి, కొద్ది క్షణాల్లోనే మృతదేహంగా ఒడ్డుకు కొట్టుకువచ్చాడు. మెరీనా పోలీసులు దయానందన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భవనం పైనుంచి పడి
వ్యక్తి మృతి
అన్నానగర్: బిహార్‌లోని భాగల్పూర్ ప్రాంతానికి చెందిన అభిషేక్ కుమార్ (23). ఇతను చైన్నెలోని త్యాగరాయ నగర్‌లో కొత్తగా నిర్మించిన భవనంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతను తన బంధువులతో కలిసి ఉంటూ పనిచేసేవాడు. అభిషేక్‌కుమార్‌కు మద్యం తాగే అలవాటు ఉంది. ఈ స్థితిలో, గురువారం రాత్రి అభిషేక్‌కుమార్ తన సోదరి భర్తతో కలిసి అదే భవనంలోని 4వ అంతస్తుకు వెళ్లి మద్యం తాగాడు. అనంతరం ఇద్దరూ అక్కడే నిద్రించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షం కారణంగా ఇద్దరూ కిందకు దిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అభిషేక్‌కుమార్ కాలు జారి కిందపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అభిషేక్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పాండీ బజార్ పోలీసులు, అభిషేక్‌కుమార్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ ఢీకొని బాలుడి మృతి
తిరువొత్తియూరు: గిండి కత్తిపారా ఫ్లైఓవర్ వద్ద బైక్ ఢీకొని తల్లి కళ్లేదుటే బాలుడు మృతి చెందాడు. చైన్నె పశ్చిమ సైదాపేట శేఖర్‌నగర్‌కు చెందిన గణపతి (32) ఒక సంస్థలో మేనేజర్. ఇతని భార్య కోమతి (26). వీరి కుమారుడు దేవరాజన్ (7). కోమతి గిండిలోని పెట్రోల్ బంకులో పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం కోమతి పని ముగించుకుని తన కుమారుడు దేవరాజన్‌ను సైకిల్‌లో ఎక్కించుకుని ఇంటికి వెళ్తుండగా, కత్తిపారా ఫ్లైఓవర్ వద్ద బైక్ సైకిల్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో దేవరాజన్ మృతిచెందాడు. కోమతి తీవ్ర గాయాలతో గిండిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదానికి కారణమైన చైన్నె సైదాపేటకు చెందిన శరవణన్ (30)ను అరెస్ట్ చేశారు.
అరణియార్‌లో
వృద్ధురాలి మృతదేహం
నాగలాపురం: పిచ్చాటూరు మండల కేంద్రంలోని అరణియార్ ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం ఓ వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. రెప్పాలపట్టు సమీపంలో ప్రాజెక్టులో ఓ శవం తేలుతుందని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాజెక్టులో తేలుతున్న మృతదేహాన్ని బోటు ద్వారా వెలికి తీశారు. మృతురాలు నారాయనవనం మండలం, నైనారు కండ్రిగ గ్రామానికి చెందిన లేట్ సుబ్రమణ్యం భార్య లైలమ్మ(70)గా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు పిచ్చాటూరు ఎస్‌ఐ రాఘవేంద్ర తెలిపారు.


