సాక్షి, చైన్నె: డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు కోసం పెద్ద పోరాటమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామికి కనీస గౌరవం లేదని అభిప్రాయపడ్డారు. పొత్తుల కోసం పోయేస్ గార్డెన్‌కు వచ్చే కాలం పోయి.. ఢిల్లీకి వెళ్లే పరిస్థితి వచ్చింది తిరుమావళవన్ వ్యాఖ్యానించారు. వివరాలు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పొత్తులు, సీట్ల సర్దుబాటుపై వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్ శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైన్నెలో ఎన్నికల బరిలో నిలిచే పార్టీ ఆశావహుల నుండి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు ఎన్నికల పొత్తుల కోసం పార్టీలు పోయేస్ గార్డెన్ (జయలలిత నివాసం) చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారి పొత్తుల కోసం ఢిల్లీ వైపు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకే వంటి పెద్ద పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఎడప్పాడి పళనిస్వామిని, బీజేపీ గడ్డిపరకలా చూస్తోందన్నారు.
తక్కువ సీట్లతో అయినా..
డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు చర్చలు ప్రశాంతంగా సాగుతున్నాయని, ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి పార్టీ ప్రయోజనాలతో పాటూ కూటమి ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని తక్కువ సీట్లకై నా సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సీట్ల కోసం పెద్ద పోరాటం తప్పలేదని, సంఖ్యను తగ్గించడం వేదన కలిగిస్తున్నదన్నారు. ఎన్ని కొత్త కూటములు వచ్చినా, డీఎంకే నేతృత్వంలోని కూటమి బలంగా ఉందని, తమ కూటమే విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీపీఎం, తమిళర్ వాల్వురిమై కట్చిలు కూడా తమ కూటమిలో కొనసాగుతాయని ఆశిస్తున్నామన్నారు.
సీపీఎం విస్తృత చర్చ
సీపీఎంకు ఐదు స్థానాలే ఇస్తామని డీఎంకే స్పష్టంచేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం చైన్నెలో జరిగింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ సైతం ఈ సమావేశానికి హజరయ్యారు. డీఎంకే ఇచ్చే ఐదు సీట్లు తీసుకోవాలా..? వద్ద అన్న విషయంగా చర్చించారు. గతంలో ఇచ్చినట్టుగా ఆరు సీట్లు ఇవ్వాలని మరోమారు చర్చల సమయంలో ఒత్తిడి తెచ్చేందుకు నిర్ణయించారు.అదేసమయంలో ఎండీఎంకే నేత వైగో సీపీఎం ప్రధాన కార్యదర్శి బేబీతో భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. ఇక, తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్ డీఎంకేకు అల్టిమేటం ఇచ్చార. 24 గంటలు వేచి చూస్తామని, లేని పక్షంలో కూటమి నుంచి వైదొలగుతామని ప్రకటించడం గమనార్హం.


