9 మందితో బీజేపీ జాబితా | - | Sakshi
Sakshi News home page

9 మందితో బీజేపీ జాబితా

Mar 22 2026 1:55 AM | Updated on Mar 22 2026 1:55 AM

● పుదుచ్చేరిలో వేడెక్కిన రాజకీయం ● రేపటితో నామినేషన్లకు తెర ● డీఎంకే, కాంగ్రెస్‌లో ప్రతిష్టంభన

సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 9 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ శనివారం ప్రకటించింది. మరో స్థానానికి అభ్యర్థిని పెండింగ్‌లో పెట్టారు. పుదుచ్చేరిలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, బీజేపీ మధ్య బంధం మళ్లీ వికసించినట్లయ్యింది. కేంద్ర పెద్దల జోక్యంతో సీఎం రంగస్వామి తగ్గినట్టున్నారు. బీజేపీకి పది స్థానాలు కేటాయించారు. దీంతో ఈ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, జాతీయ అధ్యక్షుడు నితిన్‌ విపిన్‌ సమక్షంలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఎంపిక చేశారు. అనంతరం జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ ఈ జాబితాను విడుదల చేశారు.

అభ్యర్థులు వీరే ..

మన్నాడి పేట నుంచి పుదుచ్చేరి హోం మంత్రి నమశ్శివాయం పోటీ చేయనున్నారు. ఊసుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీప్పాయిందాన్‌, కాలా పట్టులో ఎమ్మెల్యే కల్యాణ సుందరం, రాజ్‌ భవన్‌ నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షుడు రామలింగం, మొదలియార్‌ పేట నియోజకవర్గంలో మంత్రి జాన్‌ కుమార్‌, మణవేలిలో స్పీకర్‌ ఎన్బలం సెల్వం, తిరునల్లారులో ఎమ్మెల్యే రాజశేఖరన్‌, నిరవి టీఆర్‌ పట్టణంలో పార్టీ నాయకుడు మీనాక్షి సుందరం, మాహే నియోజకవర్గంలో దినేశన్‌ పోటీ చేయనున్నారు. కాగా గత ఎన్నికల్లో ఊసుడు నియోజకవర్గం నుండి గెలిచిన మాజీ మంత్రి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే సాయి శరవణన్‌ కుమార్‌కు ఈసారి టికెట్‌ నిరాకరించారు. ఆయన స్థానంలో తీప్పాయిందాన్‌ బరిలోకి దిగుతున్నారు.

మారిన స్థానాలు

గతంలో ఎన్‌.ఆర్‌. కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మీనారాయణ గెలిచిన రాజ్‌భవన్‌ స్థానం ఈసారి బీజేపీకి కేటాయించారు. దీంతో అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామలింగం పోటీ చేస్తున్నారు. మంగళం నియోజకవర్గంలో ప్రస్తుత మంత్రి తేనీ జయకుమార్‌కు బదులుగా సీఎం రంగస్వామి పోటీ చేస్తుండటం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ కూటమిలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 16 స్థానాలలో పోటీ చేస్తుండగా, బీజేపీతో కలిసి వచ్చిన అన్నాడీఎంకే తదితర పార్టీలకు మిగిలిన నాలుగు స్థానాలు కేటాయించారు.

డీఎంకే, కాంగ్రెస్‌లో ఉత్కంఠ

ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, బీజేపీ కూటమిలో వివాదాలు సమసినట్టే అన్నది దాదాపుగా నిర్ధారణ అయినా, డీఎంకే, కాంగ్రెస్‌ కూటమిలో వివాదం కొనసాగుతోంది. కూటమి ఎవరి నేతృత్వం అన్నది ఇంకా తేల లేదు. సీట్ల విషయానికి వస్తే డీఎంకే, కాంగ్రెస్‌లు తలా 15 స్థానాలలో పోటీచేసేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. అదే సమయంలో నియోజకవర్గాల ఎంపిక విషయంలో వివాదాలు నెలకొని ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆదివారం కూటమి లెక్కల్ని తేల్చి చివరి రోజైన సోమవారం నామినేషన్ల దాఖలుకు కాంగ్రెస్‌ నేతలు ఉరకలు తీస్తున్నారు. అన్నీ సజావుగా సాగేనా అన్న ఉత్కంఠ కాంగ్రెస్‌ వర్గాలలో సైతం నెలకొంది. ఇక, ఇప్పటికే అనేక నియోజకవర్గాలలో డీఎంకే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి ఉండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement