సాక్షి, చైన్నె: ఎన్‌డీఏకు షాక్ ఇచ్చే దిశగా రాష్ట్రంలో కొత్తకూటమి ఏర్పాటైంది. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, దివంగత సీఎం జె. జయలలిత నెచ్చెలి శశికళ నేతృత్వంలో ఈ కూటమి ఏర్పాటు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే నాలుగు ప్రధాన పక్షాలు మధ్య పోటీ ఖాయం కాగా, తాజాగా రాందాసు, , శశికళ జతకట్టడం ఐదో శక్తిగా కొత్త కూటమి తమిళనాట అవతరించింది. ఈ కొత్త కూటమితో ఎన్‌డీఏపై ప్రభావం పడే అవకాశం ఉన్నాయి.
నష్టం ఎవరికి?
ద్రోహం తల బెట్టిన ఎన్‌డీఏ వైపుగా తమను మోసం చేసిన వాళ్లు వెళ్లడంతో వారికి గుణపాఠం చెప్పే దిశగా ప్రస్తుతం రాందాసు, శశికళలు ఒకే వేదికపైకి వచ్చారు. ఈ ఇద్దరు ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేస్తూ తాజాగా ప్రకటించారు. ఈ కూటమికి విజయ అవకాశాలు తక్కువే అయినా, ఉత్తర ,దక్షిణ తమిళనాడు జిల్లాల్లో ఓట్లను భారీగా చీల్చే అవకాశం ఉంది. ఉత్తర జిల్లాలు వన్నియర్ ప్రభావం అధికంగా ఉండటం, వీరంతా రాందాసు వైపుగా నిలబడుతుండటంతో ఈ ఓట్లు అన్భుమణికి గండి పడే అవకాశాలు ఎక్కువే. సుమారు వంద నియోజకవర్గాలలో రాందాసు మద్దతు దారులు ఉండటం గమనార్హం. ఇక, దక్షిణ – డెల్టా జిల్లాలలో ముక్కులత్తోర్ ప్రభావం ఎక్కువ. శశికళకు ముక్కులత్తోర్ సామాజిక వర్గం బలం ఎక్కువే. సుమారు 60 నుంచి 80నియోజకవర్గాలలో పట్టు ఉండటంతో ఈ ఓట్లు అన్నాడీఎంకే, అమ్మమక్కల్ మున్నేట్ర కళగంకు చీలిక దారి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. గెలుపు కంటే కూడా, నియోజకవర్గానికి 2 వేల నుంచి పది వేల ఓట్ల వరకు చీల్చడమే లక్ష్యంగా ఈకూటమి ఆవిర్భవించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ కూటమి లక్ష్యం అన్నాడీఎంకే, పీఎంకే, అమ్మమక్కల్‌మున్నేట్ర కళగం ఓట్లను చీల్చడమే అని రాందాసు, శశికళ మద్దతు వర్గం పేర్కొంటుండటం గమనార్హం. తనను కాదని పార్టీని నడుపుతున్న అన్బుమణిని దెబ్బతీయడం లక్ష్యంగా రాందాసు వ్యూహాలు ఉన్నాయని, అలాగే తనను దూరం చేసిన ఎడప్పాడి పళనిస్వామి, టీటీవీ దినకరన్‌కు రాజకీయంగా చెక్ పెట్టడమే లక్ష్యంగా చిన్నమ్మ శశికళ ఎన్నికల పయనం ఉంటుందని పేర్కొంటున్నారు. అదే సమంలో పళణి స్వామి, దినకరన్, అన్భుమణి మద్దతు దారులు పేర్కొంటూ, కాలం మారిందని, రాందాసు, శశికళ పాచికలు ఇక పనికి రావు అని, వారెన్ని వ్యూహాలు పన్నినా నష్టం వారికే అని వ్యాఖ్యానిస్తున్నారు.
అన్బుమణికి సంకటం
పీఎంకేలో రాందాసు, అన్బుమణి మధ్య జరుగుతున్న సమరం గురించి తెలిసిందే. పీఎంకే తనదేనంటూ అన్బుమణి రాజకీయ ప్రయాణం సాగిస్తూ ఎన్‌డీఏ కూటమిలో చేరారు. పార్టీ, చిహ్నం తనదే అని అన్భుమణి ప్రకటించుకున్నా, న్యాయం, జనం తన వైపు ఉన్నారన్న ధీమాతో రాందాసు ముందుడుగు వేస్తున్నారు. ఇక, దివంగత సీఎం జయలలిత హయాంలో అన్నాడీఎంకేలో చక్రం తిప్పిన శశికళ, ఎడప్పాడి పళనిస్వామి హయాంలో పార్టీకి దూరమయ్యారు. ప్రస్తుతం ఆమె ‘ఆలిండియా పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం‘ అనే పార్టీని స్థాపించి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. తన ప్రతినిధి, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ ఓ వైపు తాను పెంచి ప్రోత్సహించిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి మరో వైపు వెన్ను పోటు పొడవడంతో శశికళ తీవ్ర ఆగ్రహంతో వారికి గుణపాఠం చెప్పడమే ధ్యేయంగా కొత్త పార్టీతో రాజకీయ అడుగులు వేస్తున్నారు.


