‘సర్దుబాటు’కు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

‘సర్దుబాటు’కు సన్నద్ధం

Mar 23 2026 8:33 AM | Updated on Mar 23 2026 8:33 AM

● తుది దశకు చర్చలు ● పళణి, పీయూష్‌ సమక్షంలో సంకతాలు ● కసరత్తులలో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి

సాక్షి, చైన్నె : సీట్ల సర్దుబాటు ప్రక్రియకు అన్నాడీఎంకే, బీజేపీ కూటమి సన్నద్ధమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా జోక్యంతో చర్చలు తుది దశకు చేరాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ , కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ సమక్షంలో సోమలేదా మంగళవారం ఒప్పందాల సంతకాలకు కసరత్తు చేస్తున్నారు. వివరాలు.. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి లో అన్బుమణి పీఎంకే, దినకరన్‌ అమ్మమక్కల్‌ మున్నేట్రకళగం, జీకే వాసన్‌ తమిళ మానిల కాంగ్రెస్‌, పారి వేందర్‌ ఐజేకే, ఏసీ షణ్ముగం పుదియ నీది కట్చి తదితర పార్టీలు ఉన్న విషయం తెలిసిందే. వీటికి సీట్ల పంపకాల పెద్ద సవాలుగానే మారింది. మిత్రులందరూ బీజేపీ పిలుపు మేరకు తాము కూటమిలోకి చేరినట్టుగా పేర్కొంటూ, తమిళనాడు ఎన్‌డీఏ కూటమి అధికారం అన్న నినాదాన్ని అందుకుంటూ రావడం అన్నాడీఎంకేకు మింగుడు పడలేదు. చివరకు వ్యవహారం ఢిల్లీకి చేరింది. గత రెండు మూడు రోజులుగా ఓ వైపు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, మరోవైపు టీటీవీ దినకరన్‌, అన్బుమణి అంటూ నేతలందరూ ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీలు సాగాయి. దీంతో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లయ్యింది. అమిత్‌ షా జోక్యం తదుపరి టీటీవీ దినకరన్‌ సైతం తమిళనాడులో అన్నాడీఎంకే నేతృత్వంలో కూటమి అన్న వ్యాఖ్యలు అందుకోవడం గమనార్హం.

ఒప్పందాలకు సన్నద్ధం..

ఈ ఎన్నికలో బీజేపీకి 31, అన్బుమణి పీఎంకేకు19, దినకరన్‌ పార్టీకి 9, వాసన్‌ పార్టీకి 3, ఇతర పార్టీలకు ఒకటి లేదా రెండు స్థానాలను కేటాయిస్తూ అన్నాడీఎంకే నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. 234 స్థానాలలో మిత్రులకు మిత్రులకు 65లోపు స్థానాలను సర్దుబాటు చేసి, 170 స్థానాలలో అన్నాడీఎంకే అభ్యర్థులు నిలబడే దిశగా కసరత్తు జరిగినట్టు చర్చ జరుగుతోంది. ఈ మేరకు సోమవారం కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చైన్నెకు రానున్నారు. తొలుత బీజేపీ వర్గాలతో సమావేశం జరగబోతోంది. అనంతరం సీట్ల సర్దుబాటు గురించి ఒప్పందాలకు చర్యలు తీసుకోనున్నారు. సోమవారం రాత్రి లేదా, మంగళవారం ఉదయం మిత్రులందరికీ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ఒప్పందాల దిశగా కసరత్తు చేసి ఉండటం గమనార్హం. ఈ ఒప్పందాలు ముగియగానే, అభ్యర్థుల జాబితాను ప్రకటించే దిశగా పళణిస్వామి వ్యూహాలకు పదును పెట్టినట్టు పార్టీవర్గాలు చెబుతున్నారు. 60 మందితో తొలి జాబితా సిద్ధమైనట్టు పేర్కొంటున్నారు. ఈనెల 25వ తేదిన ఈ జాబితా వెలువడిన వెలువడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ జాబితా తదుపరి పళణిస్వామి నియోజకవర్గాల వారీగా విస్తృత పర్యటన చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణలో అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై నేతృత్వంలోని ప్రచార కమిటీ ఆదివారం చైన్నెలో సమావేశమైంది. ప్రచార పర్యటనలు, అధికార ప్రతినిధులు, స్టార్స్‌ క్యాంపెయినింగ్‌కు సంబంధించిన కార్యాచరణను ఈ సమావేశంలో సిద్ధం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement