కొరుక్కుపేట: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బహుమతుల తరలింపును నివారించడానికి సబర్బన్ ఎలక్ట్రిక్ రైళ్లలో 24 గంటలు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు రైల్వే పోలీసులు ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ఠ్యా రాజకీయపార్టీలు ఓటర్లకు బహుమతులు, నగదు పంచకుండా నిరోధించడానికి చైన్నెలో రెవెన్యూశాఖ, ఆర్పీఎఫ్ పోలీసులను కట్టు దిట్టమైన నిఘాలో ఉంచారు . ఈక్రమంలో రైల్వే రక్షఖ దళం చైన్నె సెంట్రల్, ఎగ్మూర్ రైల్వేస్టేషన్‌లో ఒక ప్రత్యేక ఎన్నికల పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేసి మూడు వారాల్లోగా రూ.1.60 కోట్ల విలువైన బంగారం, రూ.11.56 కోట్ల నగదు, రూ.1.50 కోట్ల విలువైన వెండి కడ్డీలను స్వాదీనం చేసుకున్నారు.
తిరువళ్లూరు: మద్యం తాగేందుకు ప్లాస్టిక్ గ్లాస్ ఇవ్వడానికి నిరాకరించిన వ్యాపారిపై కత్తితో దాడి చేసి గాయపరిచిన రౌడీషీటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు అమ్మనంబాక్కం ప్రాంతానికి చెందిన రవి(52). ఇతను తామరపాక్కం ప్రాంతంలో నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి దుకాణానికి వచ్చిన తామరపాక్కం గ్రామానికి చెందిన ఽరౌడీషీటర్ ధనశేఖర్(22) ప్లాస్టిక్‌గ్లాసుతో పాటు ఇతర వస్తువులను ఫ్రీగా ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అందుకు రవి నిరాకరించడంతో ఆగ్రహించిన రౌడీషీటర్ ధనరాజ్ కత్తితో వ్యాపారిపై విచాక్షణరహితంగా దాడి చేసి పరారయ్యాడు. ఫిర్యాదు మేరకు వెంగల్ పోలీసులు ధనశేఖర్‌ను అరెస్టు చేశారు. కాగా గాయపడిన రవిని చికిత్స నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రౌడీషీటర్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
కొరుక్కుపేట: రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన మదురైలో చోటుచేసుకుంది. మదురైలోని అనుపనాడి ప్రాంతానికి చెందిన కుమార్ వంట మాస్టర్. ఇతని భార్య చందనకుమారి. వీరి కుమారుడు గురుపాండి (18) నిర్మాణ పనులు చేస్తుంటాడు. నిన్న రాత్రి ఇతను, అతని స్నేహితుడు గురుప్రసాద్ కలసి మదురైలోని తెప్పకుళం సమీపంలో ద్విచక్రవాహనంలో వెళుతున్నారు. కామరాజ్‌సాలైలోని ఒక ప్రైవేట్ పాఠశాల సమీపం వైపు వెళుతున్నారు. అదేసమయంలో తిరునల్వేలి జిల్లా లోని పలయం కోట్టైకి చెందిన శ్యామ్యూల్ (21) ద్విచక్రవాహనం గురుపాండి బైక్‌ను అతివేగంతో ఢీకొంది. ఈ ప్రమాదంలో గురుపాండి, శ్యామ్యూల్ అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వైభవం.. తీర్థేశ్వరుడి తిరుకల్యాణం
తిరువళ్లూరు: పట్టణంలోని త్రిపురసుందరి సమేత తీర్థేశ్వరుడి తిరుకల్యాణం వైభవంగా జరిగింది. త్రిపుర సుందరి సమేత తీర్థేశ్వరుడి ఆలయంలో ప్రతి ఏటా పంగుణి మాసంలో ఉత్సవాలు 12 రోజులపాటు జరగడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఉత్సవాలు గత 13న ధ్వజారోహణంతో ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు శనివారం రాత్రి స్వామివారి తిరుకల్యాణం వైభవంగా నిర్వహించారు. తిరుకల్యాణం అనంతరం ఊంజల్‌సేవ నిర్వహించారు. యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు మంగళసూత్రాలను ఆలయ నిర్వాహకులు అందజేశారు.
అన్నానగర్: మొలల వ్యాధి భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపోరూర్ సమీపంలోని మురుగమంగళం హౌసింగ్ బోర్డ్ ప్రాంతానికి చెందిన హరికరణ్(28) మొలల వ్యాధితో బాధపడుతూ గత ఐదేళ్లుగా తాంబరం సిద్ధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ స్థితిలో మనస్తాపం చెందిన అతను, శనివారం రాత్రి 10.30 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో ఫ్యాన్‌న్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కాయారు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం చెంగల్పట్టు ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నానగర్: కుండ్రత్తూరు సమీపంలో తల్లి మృతిని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుండ్రత్తూరు సమీపంలోని నందంబాక్కం, భారతీనగర్‌కు చెందిన బాలాజీ. ఇతని భార్య కొన్ని నెలల క్రితం మృతిచెందింది. వీరికి గోపి (21) అనే కుమారుడు ఉన్నాడు. ఇతను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తల్లి మృతితో మనోవేదనతో బాధపడేవాడు. ఈక్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న తిరుముడివాక్కం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తాంబరం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


