సాక్షి, చైన్నె : విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరులో బ్రహ్మోత్సవాలకు మంగళవారం ఘనంగా ధ్వజారోహణం జరిగింది. ఆండాల్ అమ్మవారి కల్యాణ మహోత్సవం ఏప్రిల్ 1న నిర్వహించనున్నారు. వివరాలు.. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరులో ఆండాల్ అమ్మవారి ఆలయం ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఈ ఆలయ గోపురమే ప్రభుత్వ అధికారిక ముద్ర చిహ్నంగా ఉంది.108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటిగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం పంగుని మాస బ్రహ్మోత్సవాలు 13 రోజుల పాటుగా అత్యంత వేడుకగా జరుగుతాయి. ఆ దిశగా ఈ ఏడాది ఉత్సవాలకు మంగళవారం ఉదయం శ్రీకారం చుట్టారు. ఆలయంలో వేకువ జాము నుంచి విశిష్ట పూజలు, అమ్మవారికి అభిషేకాలు జరిగాయి. ఉదయం 9 గంటలకు మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవాలకు ధ్వజారోహణం నిర్వహించారు. అంతకుముందు ధ్వజపటాన్ని ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆండాళ్, రంగమన్నార్ దివ్య దంపతులు సర్వాలంకార భూషితులై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాల్లో 5వ రోజైన ఈనెల 28న గరుడ సేవ జరగనుంది. ఏప్రిల్ 1న పంగుని ఉత్తరం రోజున ఉదయం 7.05 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఆండాళ్ అమ్మవారి – రంగమన్నార్ స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది.
ఆలయ విశిష్టత
శ్రీవిల్లిపుత్తూరు ఆలయానికి వైష్ణవ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. పెరియాళ్వార్, ఆండాళ్ అమ్మవారు ఇక్కడే అవతరించారు. పెరియాళ్వార్ కుమార్తెగా అవతరించిన ఆండాళ్, మార్గశిర మాసంలో శ్రీకృష్ణుడిని స్మరిస్తూ ’తిరుప్పావై’ పాడి నోము నోచారు. ఫలితంగా పంగుని ఉత్తరం రోజున రంగమన్నార్ స్వామిని వివాహం చేసుకున్నారని ఆలయ చరిత్ర చెబుతోంది. కాగా, ఈ ఉత్సవాల సందర్భంగా రోజూ రాత్రి స్వామి, అమ్మవార్లు వివిధ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇక్కడి ఉత్సవాలతో పాటుగా కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రవ్యాప్తంగా భారీగా భక్తులు తరలి రావడం జరుగుతోంది. దీంతో ఆలయ నిర్వాహకులు, విరుదునగర్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేస్తూ పోలీసులు చర్యలు తీసుకున్నారు.


