సమతామూర్తి క్షేత్రం అద్భుతం | CM YS Jaganmohan Reddy Visits Samathamurthy Statue At Hyderabad | Sakshi
Sakshi News home page

సమతామూర్తి క్షేత్రం అద్భుతం

Published Tue, Feb 8 2022 3:19 AM | Last Updated on Tue, Feb 8 2022 8:37 AM

CM YS Jaganmohan Reddy Visits Samathamurthy Statue At Hyderabad - Sakshi

తెలంగాణలోని ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల విగ్రహం వద్ద సీఎం వైఎస్‌ జగన్, చినజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి దంపతులు, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, విప్‌లు చెవిరెడ్డి, ఉదయభాను

సాక్షి, హైదరాబాద్‌: ప్రాణికోటి సమానత్వ భావాన్ని విశ్వవ్యాప్తం చేసే ఉద్దేశంతో రూపుదిద్దుకున్న శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి స్పూర్తి కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సందర్శించారు. శ్రీలక్ష్మీనారాయణ హోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. రామానుజుల విరాట్‌మూర్తిని, దివ్యదేశాలను సందర్శించుకున్నారు. దివ్యక్షేత్రం అద్భుతంగా రూపుదిద్దుకుందని, పట్టుదలతో గొప్ప క్షేత్రాన్ని రూపొందించారని చినజీయర్‌ స్వామిని కొనియాడారు.



నాలుగు గంటల పాటు క్షేత్రంలో..
ఏపీ దేవాదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులతో కలిసి వైఎస్‌ జగన్‌ సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సమతామూర్తి కేంద్రానికి వచ్చారు. నేరుగా విశ్రాంతి మందిరానికి వెళ్లి.. పట్టువస్త్రాలు ధరించి, నామం పెట్టుకుని క్షేత్రంలోని ప్రవచనశాలకు చేరుకున్నారు. అదే సమయంలో విష్ణుసహస్రనామ బృంద పారాయణాన్ని పూర్తిచేసిన చినజీయర్‌ స్వామి, పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు సీఎం జగన్‌ బృందానికి స్వాగతం పలికారు.

ఆకట్టుకున్న అమెరికా చిన్నారుల అవధానం
అమెరికాకు చెందిన ప్రవాస భారతీయ చిన్నారులు ప్రవచనశాలలో నిర్వహించిన విష్ణు సహస్రనామ అవధానాన్ని సీఎం వైఎస్‌ జగన్, మిగతావారు ఆసక్తిగా తిలకించారు. ఆ చిన్నారులు విష్ణు సహస్రనామాల్లోని ఏదైనా శ్లోకం మొదటి పాదం చెప్పగానే ఆ శ్లోకం సంఖ్య చెప్పడం.. ఏదైనా శ్లోకం సంఖ్య చెప్పగానే సదరు శ్లోకం మొదటి పాదాన్ని అప్పజెప్పడం.. శ్లోకాల్లోని ఏదో ఓ పేరు చెప్పగానే ఆ పేరు సహస్రనామాల్లో ఎన్ని పర్యాయాలు వినిపిస్తుందో, ఏ శ్లోకం ఎన్నో పాదంలో ఉంటుందో చెప్పడం వంటి అద్భుత ప్రతిభను కనబరిచారు. వారందరినీ వైఎస్‌ జగన్‌ అభినందించారు. అమెరికాలో ఉంటూ కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో పెరుగుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు అందించిన ఆధ్యాత్మిక పుస్తకాలను స్వీకరించారు. అదే వేదిక మీద శ్రీరామానుజుల గొప్పదనం, వెయ్యేళ్ల కిందే సమతాస్ఫూర్తి కోసం ఆయన పాటుపడిన తీరును జగన్‌ కొనియాడారు. గొప్ప క్షేత్రాన్ని నిర్మించారని చినజీయర్‌ స్వామిని ప్రశంసించారు.

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

దివ్య దేశాలు, విరాట్‌మూర్తి దర్శనం
ప్రవచనశాలలో కార్యక్రమం ముగిశాక.. చినజీయర్‌ స్వామి, జూపల్లి రామేశ్వరరావు కలిసి వైఎస్‌ జగన్‌ బృందాన్ని ప్రధాన క్షేత్రంలోకి తోడ్కొని వెళ్లారు. 108 దివ్యదేశాలను చూపించారు. ప్రత్యేక హెడ్‌సెట్‌ ద్వారా వాటి ప్రత్యేకతలను జగన్‌ విన్నారు. తర్వాత విరాట్‌మూర్తి దిగువన ఉన్న సువర్ణ మూర్తిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి భారీ విరాట్‌మూర్తి వద్దకు చేరుకుని పరిశీలించారు. రామానుజుల మూర్తి అద్భుతంగా రూపొందిందని, మోములో ప్రశాంత చిత్తం ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు. రామానుజుల జీవితచరిత్రను తెలిపే అగుమెంటెడ్‌ రియాలిటీ షోను తిలకించారు.

గోత్రనామాలతో వేదాశీర్వచనం
తిరిగి యాగశాలకు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. రుత్వికులు జగన్‌మోహన్‌రెడ్డి, వారి మాతృమూర్తి విజయమ్మ, ధర్మపత్ని భారతీరెడ్డి, పిల్లల పేర్లను గోత్రనామాలు, నక్షత్రాలతో సంకల్పం చెప్పించారు. ప్రత్యేకంగా వేసిన పీటపై వైఎస్‌ జగన్‌ను కూర్చోబెట్టి.. యజ్ఞ కంకణం, లక్ష్మీనారాయణ హోమ కడియం ధరింపచేసి.. విశ్వక్సేన ఆరాధన చేయించారు. యాగద్రవ్యాలను తాకించి పూర్ణాహుతి పూర్తి చేశారు. తర్వాత తీర్థప్రసాదాలు అందించారు. చివరగా 5వేల మంది రుత్వికుల సాక్షిగా వైఎస్‌ జగన్‌కు వేదాశీర్వచనం అందించారు.

సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం
సమతామూర్తి క్షేత్రంలో ప్రతిచోటా సీఎం వైఎస్‌ జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీపడ్డారు. కొన్నిచోట్ల పోలీసులు సాధారణ జనాన్ని అనుమతించకపోవటంతో.. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లలో వస్తున్న ప్రత్యక్ష ప్రసారాన్ని ఫోన్లలో బందిస్తూ కనిపించారు. యాగశాలలో రుత్వికులు కూడా జగన్‌తో సెల్ఫీలు తీయించుకున్నారు. కొందరు రుత్వికులు పలు విన్నపాలు చేసుకున్నారు. క్షేత్రం నుంచి బయల్దేరే ముందు చినజీయర్‌స్వామికి సీఎం జగన్‌ పాదాభివందనం చేసి, ఆశీర్వాదం తీసుకున్నారు. కారు ఎక్కేముందు పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు జగన్‌ను ఆలింగనం చేసుకున్నారు. 

రామానుజులు, జగన్‌.. జన్మ నక్షత్రం ఒకటే..
ప్రవచనశాలలో అమెరికాకు చెందిన ప్రవాస చిన్నారులు ఎవరైనా జన్మ నక్షత్రం చెప్పగానే.. విష్ణుసహస్రనామంలో ఆ నక్షత్రానితో ప్రమేయమున్న శ్లోకాలను వినిపించి ఆశ్చర్యపరిచారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ జన్మ నక్షత్రం ఆరుద్రను ప్రస్తావించగా.. అది ఆరో నక్షత్రమని చెప్పి, 21 నుంచి 24 వరకు ఉన్న శ్లోకాలు దానితో ముడిపడి ఉన్నాయని వివరించారు. స్వయంగా శ్రీరామానుజులది కూడా ఇదే నక్షత్రమని చిన్నారులు చెప్పడంతో ఆ ప్రాంగణంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement