హైదరాబాద్‌–మహబూబ్‌నగర్‌.. ‘డబుల్‌ లైన్‌’ జూన్‌లో! | Double Rail Line For Hyderabad To Mahbubnagar | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌–మహబూబ్‌నగర్‌.. ‘డబుల్‌ లైన్‌’ జూన్‌లో!

Published Sun, Feb 7 2021 10:26 AM | Last Updated on Sun, Feb 7 2021 10:26 AM

Double Rail Line For Hyderabad To Mahbubnagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బెంగళూరు, తిరుపతిలకు హైదరాబాద్‌ నుంచి త్వరలో కొత్త రైళ్లు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌–మహబూబ్‌నగర్‌ మధ్య రెండో రైలు మార్గాన్ని వచ్చే జూన్‌ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని తాజాగా రైల్వే టార్గెట్‌గా పెట్టుకోవటమే దీనికి కారణం. ఇది బెంగళూరుకు ప్రధాన మార్గం. కానీ హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు ప్రస్తుతం సింగిల్‌ లైన్‌ మాత్రమే ఉంది. ఆ తర్వాత డోన్‌ నుంచి రెండు లైన్లు ఉన్నాయి. సింగిల్‌ లైన్‌ కావటంతో ఈ మార్గంలో ఎక్కువ రైళ్లు నడిపే అవకాశం లేకుండా పోయింది. అందుకే రాజధాని లాంటి ప్రీమియం కేటగిరీ రైళ్లను మహబూబ్‌నగర్‌ మీదుగా కాకుండా వికారాబాద్, గుంతకల్లు మీదుగా నడుపుతున్నారు.

ఆ మార్గంతో పోలిస్తే మహబూబ్‌నగర్‌ మీదుగా బెంగళూరు 50 కి.మీ. తక్కువ దూరం అవుతుంది. ఇక తిరుపతికి కూడా ఇదే ప్రధాన మార్గం కానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి తిరుపతికి ఐదు ప్రధాన రైళ్లు నడుస్తుండగా, ట్రాఫిక్‌ ఇబ్బందుల నేపథ్యంలో ఒక్కోదాన్ని ఒక్కో రూట్‌లో నడుపుతున్నారు. కాజీపేట మీదుగా ఒకటి, నడికుడి మీదుగా రెండోది, వికారాబాద్‌ మీదుగా మూడోది, వికారాబాద్‌ నుంచి పాకాల మీదుగా నాలుగోది, మహబూబ్‌నగర్‌ మీదుగా ఐదోది నడుస్తున్నాయి. సికింద్రాబాద్‌–మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ పని పూర్తయితే ఈ మార్గం మీదుగా తిరుపతికి మరికొన్ని రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. తిరుపతికి డిమాండ్‌ అధికంగా ఉన్నందున అది లాభదాయక ప్రాంతంగా రైల్వే భావిస్తోంది. అదనంగా మరికొన్ని నడిపేందుకు వెంటనే సంసిద్ధత వ్యక్తం చేస్తుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.

‘షటిల్‌ సర్వీసు’లతో సౌలభ్యం 
హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌ 100 కి.మీ. లోపే ఉంటుంది. దీంతో ఎంతోమంది ఉద్యోగులు, ఇతర చిరువ్యాపారులు నిత్యం హైదరాబాద్‌కు వచ్చిపోతుంటారు. కానీ సింగిల్‌ లైన్‌ కావటంతో నగరం నుంచి అక్కడికి ఎక్కువ రైళ్లు నడిపే అవకాశం లేకుండా పోయింది. సాధారణ ఎక్స్‌ప్రెస్‌రైళ్లలో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించేవారు వందలమంది ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నగరం నుంచి మహబూబ్‌నగర్‌కు షటిల్‌ సర్వీసులు నడపాలన్న డిమాండ్‌ ఉంది. డబ్లింగ్‌ పని పూర్తి కాగానే కొన్ని షటిల్‌ సర్వీసులు నడిపే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

ఇండస్ట్రియల్‌ క్లస్టర్స్‌కు ఊతం.. 
షాద్‌నగర్, జడ్చర్లలు క్రమంగా ఇండస్ట్రియల్‌ క్లస్టర్స్‌గా అభివృద్ధి చెందుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతాల మౌలిక వసతుల్లో రైల్వే అనుసంధానం కూడా కీలకమైంది. సరుకు తరలింపు, కార్మికుల రాకపోకలకు రైల్వే మార్గం చాలా అవసరం. ఈ రకంగా కూడా ఈ డబ్లింగ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. రోడ్డును ఆనుకున్నట్టుగా రైల్వే మార్గంతో పరిశ్రమలకు చాలా ఉపయోగం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తాజా బడ్టెట్‌లో ఈ డబ్లింగ్‌ పనులకు రూ.100 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంతో ఆ ప్రాజెక్టు పూర్తి కానుంది.

సత్తుపల్లికీ ప్రాధాన్యం.. 
రైలు చార్జీల్లో సబ్సిడీ భాగం ఎక్కువగా ఉండటంతో బస్సు చార్జీలతో పోలిస్తే రైలు టికెట్‌ రుసుము తక్కువగా ఉంటుంది. ఈ సబ్సిడీల వల్ల రైల్వే భారీగా నష్టాలు మూటగట్టుకుంటోంది. కానీ సరుకు రవాణా ద్వారా వచ్చే లాభాలతో ఆ నష్టాలను అధిగమిస్తోంది. అందుకే మోదీ ప్రభుత్వం వచ్చాక సరుకు రవాణాకు చాలా ప్రాధాన్యం ఇస్తోంది. 2010లో మంజూరై, భద్రాచలం–సత్తుపల్లి మధ్య నిర్మిస్తున్న కొత్త లైన్‌కు పూర్తిగా బొగ్గు రవాణాకు ఉద్దేశించింది. సింగరేణి సంస్థ పాత బొగ్గు గనుల్లో నిల్వలు తగ్గిపోతుండటంతో కొత్తవాటిని అన్వేషిస్తోంది. ఈక్రమంలో సత్తుపల్లి వైపు కొత్త గనులు తవ్వనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బొగ్గు రవాణాకు కొత్త లైన్‌ కావాలని రైల్వేను కోరింది.

భూసేకణ భారం రైల్వే తీసుకుంటే లైన్‌ నిర్మాణ వ్యయాన్ని తాను భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందుకు అంగీకరించిన రైల్వే 54 కి.మీ. నిడివి గల ఈ లైన్‌ను రూ.704 కోట్ల వ్యయంతో సంయుక్త ప్రాజెక్టుగా నిర్మిస్తోంది. గత బడ్జెట్‌లో ఏకంగా రూ.520 కోట్లు కేటాయించటంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ సంవత్సరంతో పనులు పూర్తి కానుండటంతో మరో రూ.267 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం భద్రాచలం రోడ్‌ వరకే నడుస్తున్న రైళ్లు ఇక సత్తుపల్లి వరకు చేరుకోవచ్చు. బొగ్గు రవాణాకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. భవిష్యత్తులో సత్తుపల్లి నుంచి పొడిగించి ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరు వరకు దాన్ని నిర్మించాలన్నది ప్రతిపాదన. అప్పుడు ప్రయాణికుల రైళ్లకు కూడా ఇది ప్రధాన మార్గం అవుతుంది.  

ప్రయారిటీ లిస్ట్‌లో ఈ రెండు.. 
దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం కొన్ని ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసే లక్ష్యంగా ప్రయారిటీ జాబితాను రైల్వే రూపొందించుకుంది. మొత్తం 54 ప్రాజెక్టులకు గాను అందులో తెలంగాణ నుంచి పై రెండు చోటు దక్కించుకున్నాయి. ఈ సంవత్సరం జూన్‌నాటికి వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement