GHMC: ఎట్టకేలకు కదిలారు | GHMC Decides Price For Funerals | Sakshi
Sakshi News home page

GHMC: ఎట్టకేలకు కదిలారు

May 23 2021 9:42 AM | Updated on May 25 2021 3:21 PM

GHMC Decides Price For Funerals - Sakshi

గ్రేటర్‌ పరిధిలోని శ్మశానవాటికల్లో అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది.

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలోని శ్మశానవాటికల్లో అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. అంత్యక్రియలకు ఎంత చార్జి చెల్లించాలో బల్దియా ఖరారు చేయకపోవడంతో ఇష్టానుసారం వసూళ్లు చేస్తున్నారు. అంత్యక్రియలు జరిగాక, రసీదు కోసం సంబందీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేపు, మాపు అంటూ తిప్పుతున్న వారివల్ల డెత్‌ సర్టిఫికెట్‌ అత్యవసరమైన కుటుంబీకుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. మెజార్టీ శ్మశానవాటికల్లో ఇదే తంతు జరుగుతోందనే అభిప్రాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్మశనవాటికల్లో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు ఎట్టకేలకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. దహనానికి నిర్ణీత ధరల్ని నిర్ణయించింది. 

కేటీఆర్‌ దృష్టికి... 
శ్మశానవాటికల్లో రసీదు పుస్తకాలు కూడా లేని పరిస్థితుల గురించి, డెత్‌ సర్టిఫికెట్ల కోసం ‘యుద్ధం’ చేయాల్సిన పరిస్థితుల గురించి పలువురు మున్సిపల్‌ మంత్రి కేటీఆర్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ల దృష్టికి తెచ్చారు. దీంతో అసలు శ్మశానవాటికల్లో ఏం జరుగుతోందో  పరిశీలించి చక్కదిద్దాల్సిందిగా వారు ఆదేశించారు. అంత్యక్రియలకు అధికచార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలని, ప్రజల  ఇబ్బందులు తొలగించాలని వారు పేర్కొన్నారు. దీంతో శ్మశానవాటికల్లో  దహనాల చార్జీలను ఖరారు చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశాలతో నగరంలోని కొన్ని  శ్మశానవాటికలను అధికారులు పరిశీలించారు. కట్టెలతో దహనం చేస్తే ఎంత, విద్యుత్‌తో దహనం చేస్తే ఎంత, గ్యాస్‌తో అయితే ఎంత తీసుకోవాలో ధరలు నిర్వాహకులకు తెలిపారు.  

ధరల డిస్‌ప్లే... 
ఆయా శ్మశానవాటికల్లో నిర్ణీత దహన చార్జీలు ప్రజలకు తెలిసేలా బ్యానర్లు, డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.అధిక ధరలు వసూలు చేసినా, ఇతరత్రా ఫిర్యాదులున్నా ఫోన్‌ చేయాలంటూ జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌ నంబర్‌ను 040– 21 11 11 11 ఇచ్చారు. 

∙కొన్ని శ్మశానవాటికల వద్ద  సంబంధిత డిప్యూటీ కమిషనర్, ఏఎంఓహెచ్, శానిటరీ జవాన్‌ల ఫోన్‌ నెంబర్లు కూడా బ్యానర్లపై పేర్కొనడమే కాక హెల్ప్‌డెస్క్‌లు సైతం ఏర్పాటు చేశారు. 

∙ఆయా శ్మశానవాటికల వద్ద ప్రదర్శించిన ఈ ధర ల కంటే ఎక్కువ డిమాండ్‌చేస్తే  ఫిర్యాదు చేయవచ్చునని జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు.  

∙ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లేందుకు అంబులెన్సు చార్జీ రూ.4 వేలుగా  పేర్కొన్నారు.  
∙ప్రభుత్వాస్పత్రుల్లో మరణించే కోవిడ్‌ మృతదేహాలకు తాము అంత్యక్రియలు నిర్వహించలేమని కుటుంబీకులు తెలియజేస్తే, జీహెచ్‌ఎంసీయే శ్మశానవాటికకు తరలించిఅంత్యక్రియలు నిర్వహిస్తుంది. నిర్ణీత చార్జీలను చెల్లిస్తుంది.  

డెత్‌ సర్టిఫికెట్‌ జారీలో జాప్యంపైనా దృష్టి.. 
డెత్‌ సర్టిఫికెట్ల జారీలో జరుగుతున్న జాప్యంపైనా అధికారులు దృష్టి సారించారు. సర్టిఫికెట్‌ అవసరమైన వారి నుంచి డబ్బులు గుంజేందుకుగాను జారీలో జాప్యం జరిగేలా ఇబ్బందులు సృష్టిస్తున్న వారిపై, అంత్యక్రియలు ముగిశాక వెంటనే రసీదు ఇవ్వకుండా జాప్యం చేస్తున్న శ్మశానవాటికలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement